ఎల్లారెడ్డి రూరల్, మే 4: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని ఓ గుట్టపై ఎలుగుబంటి సంచా రం కలకలం రేపింది. కళ్యా ణి గ్రామానికి చెందిన మియాజానీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని రామలింగంబాయి పరిసర ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మిషన్ భగీరథ నీటి ట్యాంకు సమీపంలో తునికాకు సేకరిస్తుండగా ఎలుగుబంటి కనబడడంతో వెంటనే గ్రామానికి పరుగులు తీశాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తునికాకు సేకరణకు వెళ్లిన వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
సిరికొండ, మే 4: మండలంలోని చీమన్పల్లి గ్రామానికి చెందిన మలావ్ భారతి అనే మహిళ తునికాకు సేకరణ కోసం చిమన్పల్లి జినిగ్యాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. తునికాకు సేకరిస్తుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా వెనుకనుంచి దాడి చేయడంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెతోపాటు అడవికి వెళ్లిన వారు గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన భారతిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు.