Nizamabad | వినాయక నగర్, మార్చి25 : హైదరాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సంతాప సందేశం పంపించారు. అనంతరం జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని కోరారు. రాష్ట్ర, దేశవ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలకు గురికావడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు.
న్యాయవాదుల హత్యల పరంపర ఆగాలంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని సమగ్రంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి, చట్టరూపం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావ్, ఉపాధ్యక్షులు పెండం రాజు, దొంపల్ సురేశ్, కార్యదర్శి ఏ దీపక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్, న్యాయవాదులు విఘ్నేశ్, పడిగెల వెంకటేశ్వర్, బిట్లా రవి, పిల్లి శ్రీకాంత్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు