e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు బ్లాక్‌ ఫంగస్ అందరికీ రాదు

బ్లాక్‌ ఫంగస్ అందరికీ రాదు

బ్లాక్‌ ఫంగస్ అందరికీ రాదు

కరోనాతో ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం
రెండువారాల్లో డీ డైమర్‌, సీఆర్పీ రక్త పరీక్షలు చేయించుకోవాలి
నమస్తే ఫోన్‌-ఇన్‌లో ప్రముఖ ఛాతివైద్య నిపుణుడు డాక్టర్‌ బి.రాజేశ్వర్‌

కరోనా వేళ.. భయపెడుతున్న మరో ఆరోగ్యసమస్య బ్లాక్‌ ఫంగస్‌. అయితే కరోనా వచ్చి కోలుకున్నవారందరికీ బ్లాక్‌ ఫంగస్‌ రాదని ప్రముఖ ఛాతివైద్య నిపుణుడు డాక్టర్‌ బి.రాజేశ్వర్‌ స్పష్టంచేశారు. ‘నమస్తే తెలంగాణ’ శనివారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో పలువురి ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు. ఎక్కువగా స్టెరాయిడ్స్‌ తీసుకున్నవారికి, షుగర్‌ లెవల్స్‌ అత్యధికంగా ఉన్నవారికి మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు. ముందుగా గమనించి వైద్యులను సంప్రదిస్తే సరిపోతుందన్నారు.
-ఖలీల్‌వాడి, మే 15

కరోనా వచ్చి కోలుకున్న తర్వాత కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందని ప్రజలు భయపడుతున్నారని, అది అందరికీ రాదని ప్రముఖ ఛాతివైద్య నిపుణుడు డాక్టర్‌ బి.రాజేశ్వర్‌ స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ శనివారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో పలువురి సందేహాలను తీర్చారు. షుగర్‌ లెవల్స్‌ అతిగా ఉన్న వారికి, ఎక్కువగా స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారికి బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశముందని, ముందుగా గమనించి వైద్యులను సంప్రదిస్తే సరిపోతుందన్నారు. కరోనా వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం ఉందని, వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడాలని సూచించారు.
-ఖలీల్‌వాడి, మే 15

మా బాబుకు తరుచూ జ్వరం వస్తోంది..
-సవిత, అమ్రాద్‌
వెంటనే సీటీ స్కాన్‌ చేయించాలి. జ్వరం, జలుబు, దగ్గు వస్తుందంటే వెంటనే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది.

కరోనా వచ్చినప్పుడు వాకింగ్‌ చేయవచ్చా?
-రాజిరెడ్డి, కాలూర్‌
హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి చాలా విశ్రాంతి అవసరం. వాకింగ్‌ చేయకుండా యోగా చేసుకోవడం మంచిది. బయటికి రాకుండా ఉండాలి.

కరోనా వస్తే అస్తమాకు మందులు వాడొచ్చా..
-రవీంద్రనాథ్‌, ఖమ్మం
పాజిటివ్‌ వచ్చినా రాకున్న అస్తమా మందులు మాత్రం ఆపకూడదు. తప్పనిసరిగా వాడాల్సిందే. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

నాకు బైపాస్‌ సర్జరీ అయ్యింది. వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా?
-సుదర్శనం, ఆర్మూర్‌
నిర్భయంగా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు. అపోహలకు పోయి ప్రమాదాలను తెచ్చుకోవద్దు.

బెలూన్‌ ఊదడంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందా?
-మోహన్‌ గౌడ్‌, నిజామాబాద్‌
ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవడానికి బెలూన్లు ఊదాలి. యోగా చేయడంతో సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

బ్లాక్‌ ఫంగస్‌ ఎప్పుడు వస్తుంది?
-నవీన్‌, ఐలాపూర్‌
కరోనా వచ్చిన వారు ఎక్కువగా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ బ్లాక్‌ఫంగస్‌ రాదు. కొంతమందికి మాత్రమే వస్తుంది. ఎక్కువగా వెంటిలేటర్లపై ఉన్నవారికి, షుగర్‌ లెవల్స్‌ ఉన్నవారికి, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ వస్తుంది.

నాకు కొవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందా?
-మురళీకృష్ణ, నిజామాబాద్‌
డాక్టర్‌: కొవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత అందరికీ బ్లాక్‌ ఫంగస్‌ రాదు. షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నవారికి బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా డాక్టర్‌ని సంప్రదించడంతో బ్లాక్‌ ఫంగస్‌ని అరికట్టవచ్చు. ఇది అంటువ్యాధి కాదు.

కరోనా వచ్చింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-గంగాధర్‌, నిజామాబాద్‌/శ్రీధర్‌గౌడ్‌, నెల్లూరు
కరోనా వచ్చినప్పుడు క్రమంతప్పకుండా మందులు వాడాలి. రెండో వారంలో డీ డైమర్‌, సీఆర్పీ రక్త పరీక్షలు చేయించుకోవాలి. దీంతో రక్తం చిక్కపడడం, వాపు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అన్నింటికన్నా ధైర్యం ఎక్కువగా తెచ్చుకోవాలి.

వ్యసనాలు ఉన్న వారికి కరోనా త్వరగా సోకుతుందా?
-మోహన్‌, రెంజల్‌
ఆల్కాహాల్‌, ధూమపానం చేసే వారికి కరోనా సోకే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. వ్యసనాలు లేని వారికి తక్కువగా ఉంటుంది. వచ్చినా త్వరగా కోలుకుంటారు.

కరోనా వచ్చిన వారితో ఉన్నా.. నాకు వస్తుందా?
-ప్రవీణ్‌ కుమార్‌, నిర్మల్‌
కరోనా వచ్చిన వ్యక్తి సమీపంలో ఉన్నందున వెంటనే హోం ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. లక్షణాలు ఉంటే కుటుంబానికి దూరంగా ఉంటూ మందులు వాడాలి. వైద్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

తలనొప్పి ఎక్కువగా ఉంది..
-తిరుపతి గౌడ్‌, భీంగల్‌
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తలనొప్పి వస్తే మందులు వాడాలి. కరోనా వచ్చినప్పుడు రెండోవారంలో రక్తపరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది.
-సుమలత, మాధవపూర్‌
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే ఎక్స్‌రే తీసుకోవడం మంచిది. వీలైతే సీటీ స్కాన్‌ చేయించుకోవాలి. ఈ రోజుల్లో శ్వాసకు సంబంధించిన లక్షణాలు వస్తే కరోనా అని భావించాలి.

మూడు రోజులుగా తలనొప్పిగా ఉంది.
-కిరణ్మయి, నెల్లూర్‌
మూడు రోజులుగా తలనొప్పి ఉంటే దానికి సంబంధించిన మందులు వాడాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్లాక్‌ ఫంగస్ అందరికీ రాదు

ట్రెండింగ్‌

Advertisement