Nizam Sugar Factory | శక్కర్ నగర్ : సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నేతలను బోధన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికుల 10 సంవత్సరాల బకాయి వేతనాలు ఇప్పించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిజాం షుగర్ కాలనీలకు న్యాయం చేస్తామని, రెండు నెలల్లో ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని, వేతనాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్లు దాటినా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.
ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సాధ్యాసాధ్యులకు గాను కమిటీ వేసిన అది కాలయాపన కమిటీ గానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నిజాం షుగర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రాక సందర్భంగా తమను అరెస్ట్ చేయడం శోచనీయమని అన్నారు. తమ సమస్యలను సీఎంకు వెల్లడించుకుందామంటే అవకాశం లేకుండా తమను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. బోధన్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, కుమార స్వామి, శ్రీనివాస్, రాజారామ్ ఉన్నారు.