హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్ట అధికారుల తీరు కారణంగా మసకబారుతున్నది. వ్యవసాయ యూనివర్సిటీలు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐకార్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) అక్రెడిటేషన్ ప్రస్తుతం మన యూనివర్సిటీకి లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చి నెలతో అక్రెడిటేషన్ గడువు ముగిసింది. గడువు ముగియడానికి ముందే దరఖాస్తు చేసి వీలైనంత త్వరగా మళ్లీ పొందేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా ప్రస్తుతం యూనివర్సిటీకి అక్రెడిటేషన్ లేకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నేషనల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఐకార్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి 2021లో ఐదేండ్లకుగానూ అక్రెడిటేషన్ మంజూరు చేసింది.
ఆ గడువు ఈ ఏడాది మార్చి 27తో ముగిసింది. గడువు ముగింపునకు ముందే యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకొని దరఖాస్తు చేయాలి. సుమారు ఆర్నెళ్లు, ఏడాది ముందే ఈ ప్రక్రియ చేపట్టాలి. కానీ అధికారులు గడువు ముగిసిన తర్వాత కొత్తగా దరఖాస్తు చేసినట్టు తెలిసింది. దరఖాస్తు ఆలస్యం కావడంతో అక్రెడిటేషన్ కమిటీ యూనివర్సిటీ సందర్శనకు టీమ్‌లను కేటాయించలేదు. ఇప్పటికే కమిటీ యూనివర్సిటీలో పర్యటించి పరిశీలించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కమిటీ వచ్చి తనిఖీలు చేసి, రిపోర్టు తయారు చేసి, పరిశీలించి, గుర్తింపు ఇచ్చేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆలస్యం కారణంగా గ్రేడింగ్ తగ్గితే మరింత నష్టమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం అకడమిక్‌పై, కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రభావం చూపవచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అధికారులు కావాలనే దరఖాస్తును ఆలస్యం చేశారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పలు కారణాలు యూనివర్సిటీలో చర్చకు వస్తున్నాయి. గత రెండేండ్లుగా యూనివర్సిటీ అధికారులు ఇబ్బడిముబ్బడిగా, శాస్త్రీయత లేకుండా కొత్త కాలేజీలు ఏర్పాటు చేయడం, సీట్లు పెంచారనే ఆరోపణలున్నాయి. కొత్త కాలేజీలు, పెంచిన సీట్లకు తగ్గట్టుగా క్లాస్‌రూమ్‌లు, హాస్టళ్లను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. అదే విధంగా ఫ్యాకల్టీ కొరత కూడా భారీగా ఉన్నట్టుగా తెలిసింది. ఒకవేళ కమిటీ తనిఖీలకు వస్తే ఈ లోపాలన్నీ బయటపడే ప్రమాదం ఉండడంతో ఆలస్యం చేస్తే కొంతమేరకైనా సర్దుబాటు చేసుకోవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలిసింది. గతంలో ఐకార్ అక్రెడిటేషన్ గ్రేడ్-ఏ ఇచ్చింది. కానీ ప్రస్తుతం సౌకర్యాలలేమి, లోపాలతో గ్రేడ్ తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.