హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు హైడ్రా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాల్సిందేనని ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ తర్వాతే సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల జరిమానాను రూ.10 వేలకు తగ్గిస్తామని స్పష్టం చేసింది. హైదరాబాద్ వెంగళరావునగర్ సర్వే నంబర్45లోని సుమారు రెండెకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన వ్యవహారంలో ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డ్దాయి. ఆ భూమిలో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయినా హైడ్రా అధికారులు ఈ ఏడాది మార్చి 18న ప్రహరీని కూల్చివేసి, బోర్డులు ఏర్పాటు చేశారు.
దీనిని సవాల్ చేస్తూ మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో హైడ్రా తరఫున ఏడాదికిపైగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని సింగిల్ జడ్జి తీవ్రంగా పరిగణించారు. పలుమార్లు అవకాశాలు ఇచ్చినా స్పందించలేదని పేరొంటూ రూ.50 వేల ఖర్చు (కాస్ట్స్) విధించారు. ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్ రిట్ అప్పీళ్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. హైడ్రా తరఫున న్యాయవాది సమీర్ అహ్మద్ వాదనలు వినిపించారు.
విచారణ జరిగిన రోజునే కౌంటర్ దాఖలు చేశామని, అయితే రిజిస్ట్రీ అభ్యంతరాల కారణంగా అది నమోదు కాలేదని కోర్టుకు వివరించారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి రూ.50 వేల జరిమానా విధించారని, అది ప్రభుత్వ సంస్థపై అధిక భారం అవుతుందని తెలిపారు. వాదనలను పరిశీలించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఆదేశాల ఉద్దేశాన్ని సమర్థిస్తూనే జరిమానా మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. అయితే పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లలో హైడ్రా తప్పనిసరిగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే తగ్గింపు ఉత్తర్వులు అమలవుతాయని మధ్యంతర ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. రూ.10 వేల జరిమానా చెల్లించిన రసీదును జత చేసిన తర్వాతే కౌంటర్ పిటిషన్లను స్వీకరించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుండా కేవలం జరిమానా తగ్గింపునే కోరడం సమంజసం కాదన్నది.