తన అమృతగానంతో విశ్వవ్యాప్తంగా సంగీతప్రియుల హృదయాల్ని గెలుచుకున్న కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటించనుంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ సినిమా తాలూకు ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది.
బుధవారం (నేడు) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అగ్ర నటుడు కమల్‌హాసన్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. చెన్నైలోని సంగీత అకాడమీలో ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని అత్యుత్తమంగా తెరకెక్కించబోతున్నామని, త్వరలో మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించబోతున్నారు.