చెన్నూర్, జూలై 30: ఇది చెన్నూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డులోని ఒడ్డెపల్లి కాలనీ….రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారికి రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. కాలనీకి వెళ్లే రహదారి మధ్యలో పెద్ద ఒర్రె ఉంటుంది. వర్షాలకు ఈ ఒర్రెకు భారీ వరద నీరు వస్తుంది. దీంతో ఈ కాలనీ వాసులు అక్కడి నుంచి బయటకు (చెన్నూర్) రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని గంటల పాటు రాకపోకలు కూడా నిలిచి పోతుంటాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత బురదలో ఇబ్బందులు పడుతూ బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఆ కాలనీవాసులు బయటకు రావాలంటే ఈ ఒక్క రహదారి మాత్రమే వారికి దిక్కుగా ఉంది. ఈ పరిస్థితిని ఇప్పటి నుంచి వర్షాకాలం పూర్తయ్యే వరకూ ఒడ్డెపల్లి కాలనీవాసులు భరించాల్సిందే. ఒడ్డెపల్లి కాలనీ వాసులు బయటకు రావడానికి సిమెంటు రోడ్డును ఇప్పటికే నిర్మించి ఉంది. మధ్యలో ఉన్న ఒర్రెపై కల్వర్టు నిర్మాణానికి మున్సిపాలిటీ ఎన్నికల ముందు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్వర్టు పనుల కోసం ఒర్రె మధ్యలో తవ్వకాలు కూడా జరిపారు. ఎందుకోగాని కల్వర్టు నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపి వేశారు.
కల్వర్టు నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోవడంతో పక్క నుంచి తాత్కాలిక రహదారిని నిర్మించారు. భారీ వర్షాలకు చుట్టు పక్కల నుంచి వచ్చే వరద నీటితో పాటు, సమీపంలోని మల్లేబోయిన కుంట అలుగు వరద నీరు కూడా ఈ ఒర్రే ద్వారనే ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో ఒర్రెపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై పూర్తిగా బురదగా మారడంతో రాకపోకలకు కాలనీ వాసులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. భారీ వర్షాలతో ఒర్రెకు భారీగా వరద నీరు చేరడంతో కొన్ని గంటల పాటు రాకపోకలు కూడా నిలిచి పోతున్నాయి. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటైన చెన్నూర్ పట్టణంలోనే ఈ పరిస్థితి ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మున్సిపాలిటీ ఎన్నికల ముందు మంత్రి వివేక్ ఈ ఒర్రెపై కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, ఆ తర్వాత ఆఘ మేఘాల మీద కల్వర్టు పనులను ప్రారంభించడం, ఆ తర్వాత పనులను చేపట్టకుండానే మధ్యలోనే ఎందుకు వదిలి పెట్టారో…? కారణం ఏమిటో వివరించాలని ఓడ్డెపల్లి కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తాము కూడా మున్సిపాలిటీ పన్నులు చెల్లిస్తున్నామని, తమపై ఎందుకు ఇలా వివక్ష చూపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. చెన్నూర్‌లో పట్టణానికి చెందిన తమ కాలనీకి రాకపోకలు నిలిచిపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వర్షకాలంలో తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు జరిగేలా తగిన చర్యలు తీసుకొని, అర్ధంతరంగా నిలిపివేసిన కల్వర్టు నిర్మాణం పనులు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.