నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోజుకొకరు చొప్పున రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల దీనావస్థపై అధ్యయనం చేసేందుకు జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీకి భారీగా వినతులు వెల్లువెత్తాయి. బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులు బుస్సాపూర్‌లోని ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డితో తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ బాధలను, అవస్థలను, సలహాలు, సూచనలు, కాంగ్రెస్ పార్టీ తీరుతో ఎదుర్కొంటున్న ఇక్కట్లను అక్షర రూపంలో సమర్పించారు. బాల్కొండలోని అన్ని మండలాల నుంచి రైతులు వినతులను రాసుకొచ్చి అధ్యయన కమిటీకి స్థానిక ఎమ్మెల్యే వేముల ఆధ్వర్యంలో సమర్పించారు.
ఇందులో అనేక మంది రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కరెంట్ కోతలు, సాగునీటి సౌకర్యాలు,లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అమలులో వైఫల్యం, ఎస్సారెస్పీ నిర్వహణలో లోపాలు, పంటలకు గిట్టుబాటు, రూ.500 బోనస్ వర్తింపు, పంటల కొనుగోళ్లు వంటి సమస్యలపై మొర పెట్టుకున్నారు. గతంలో కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏడాది కాలంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కట్లు దాపురించాయి. ఊహించని విధంగా ఎదురవుతున్న ఈ సమస్యలను రైతులంతా కలిసి బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్‌కు సమర్పించారు.
నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనున్న వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని 9 మందితో కూడిన బృందం తన నివేదికలో ఈ అంశాలను పొందుపర్చనుంది. పూర్తి స్థాయి నివేదికను రైతు కమిషన్‌కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, బీఆర్ఎస్ అధినేతకు సమర్పించనున్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగట్టడంతో పాటు రైతుల సమస్యలను తీర్చేందుకు ఈ ప్రయత్నానికి బీఆర్ఎస్ ఈ దిశగా చర్యలు చేపట్టింది. రైతులకు కొండంత అండగా నిలవడంతో పాటు ఆత్మహత్యల నివారణకు బీఆర్ఎస్ అధ్యయన కమిటీ కృషి చేస్తున్నది. జిల్లా పర్యనటల్లో భాగంగా రైతుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నది. ఆత్మహత్యలు వద్దు. అండగా మేమున్నామంటూ భరోసానిస్తున్నది.