స్వరాష్ట్రంలో… స్వపరిపాలనలో తండాలకు మహర్దశ వచ్చింది. దశాబ్దాలుగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలను బీఆర్ఎస్ సర్కారు పంచాయతీలుగా మార్చింది. పదవులు సైతం కట్టబెట్టడంతో ప్రగతి పరుగులు మొదలయ్యాయి. రోడ్లు, మౌలిక వసతులు, చీకట్లో మగ్గిన తండాలు సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులతో మెరుస్తున్నాయి. సమైక్య పాలనలో పడ్డ ఇబ్బందులన్నీ సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత తొలగడంతో గిరిజనమంతా హర్షం వ్యక్తం చేస్తున్నది.
నిజాంసాగర్, ఆగస్టు 10: తండాలను పంచాయతీలుగా మార్చడంతోపాటు 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చితే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయన్న ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలోని తండాలు, 500ల జనాభా ఉన్న గ్రామాలను నూతన పంచాయతీలుగా మార్చారు. వాటి ప్రతిఫలాలు ప్రస్తుతం మన కండ్లముందు కనిపిస్తున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులే సర్పంచ్ బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పల్లెప్రగతి కార్యక్రమంతో తండాలకు టాక్టర్, ట్యాంకర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్.. ఇలా అన్ని సమకూరాయి. తండాల్లో సమస్యలు లేకుండా మారాయి. ఒకప్పుడు వర్షాలు కురిస్తే పారిశుద్ధ్య సమస్యతో సీజనల్ వ్యాధులు ప్రబలేవి.. అలాంటిది తండాలు పంచాయతీలుగా మారడం, ట్రాక్టర్ ద్వారా రోజూ చెత్త సేకరించడంతోపాటు శుద్ధమైన నీటిని సరఫరా చేస్తుండడంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. నిజాంసాగర్ మండలంలోని మగ్ధుంపూర్ గ్రామపంచాయతీలో 3500 జనాభా ఉండేది. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మార్పుతో మూడు గ్రామాలుగా మారింది. మగ్ధుంపూర్, గిర్నితండా, దూప్సింగ్తండా మూడు పంచాయతీలు అయ్యాయి. ప్రస్తుతం మగ్ధుంపూర్‌లో 1300 మంది జనాభా ఉండగా గిర్నితండాలో 1100 మంది, దూప్‌సింగ్‌తండాలో 1000 మంది జనాభా ఉన్నారు. ఈ మూడు గ్రామాలకు ముగ్గురు సర్పంచులు, ముగ్గురు కార్యదర్శులు ఉన్నారు. తండాల్లోని ప్రతి కాలనీలో సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనాలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర కార్యక్రమాలు నిరంతరం సాగుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు..
మా తండాలో ఎలాంటి సమస్యలు లేవు. పంచాయతీగా మారినంక మొదటి సర్పంచ్‌గా నియమితులయ్యాను. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహారశాల, కంపోస్ట్ షెడ్డు నిర్మించాం. ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ సహకారంతో కమ్యూనిటీ భవనం కూడా నిర్మించాం. ట్రాక్టర్, ట్యాంకర్ ఉండడంతో గ్రామంలో చెత్త కనిపించదు. జీపీగా మారడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నది.
– అనిత, సర్పంచ్, గిర్నితండా
ప్రతి కాలనీలో సీసీ రోడ్డు..
మా తండాలో గతంలో ఎన్నో సమస్యలుండేవి. ఎవరూ పట్టించుకునే వారు కాదు. పంచాయతీగా ఏర్పడ్డాక మా తండా వ్యక్తే సర్పంచ్‌గా ఎన్నికవ్వడంతో ఎలాంటి సమస్య ఉన్నా ఇట్టే పరిష్కారం అవుతుంది. చాలా రోడ్లు సీసీలుగా మారాయి. మగ్ధుంపూర్ పంచాయతీగా ఉండే సమయంలో ఏ చిన్న పని కావాలన్నా ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ సమస్య తీరింది.
– సువాలి, దూప్సింగ్తండా
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చడంతో నేరుగా నిధులు వస్తున్నాయి. దీంతో సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. ఇప్పటికే తండాలోని అన్ని రోడ్లను సీసీలుగా మార్చుకున్నాం. త్వరలో మిగిలిన పనులు పూర్తవుతాయి. మా తండాను మేము బాగు చేసుకునే రోజులు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– చందర్, సర్పంచ్, దూప్సింగ్తండా