కామారెడ్డి, ఆగస్టు 22 : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకున్నది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం ఎక్కపల్లి తండా కు చెందిన స్వరూపకు నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబీకులు శుక్రవారం జీజీహెచ్‌కు తీసుకువచ్చారు.
ఆపరేషన్ చేయాలని వైద్యులను కోరగా, వారు నార్మల్ డెలివరీ కోసం వేచి చూశారు. శనివారం నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా మగబిడ్డ జన్మించగా అప్పటికే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు దవాఖాన వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపించారు. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు.
ఈ విషయంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్‌ను వివరణ కోరగా.. గర్భిణికి రక్తం తక్కువగా ఉన్నదని, ఆపరేషన్‌కు సహకరించకపోవడంతో వచ్చి న రోజు ఆపరేషన్ చేయలేదని తెలిపారు. పుట్టిన శిశువు గుండె బలహీనంగా ఉండడంతో చనిపోయినట్లు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం లేదని, దీనిపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు.