నిజామాబాద్, జూలై 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా… ఇదేమిటి సర్? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ మొదలు కావడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. మరికొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోంది. ఇంటింటికీ వెళ్లి బీఎల్వోలే స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉండగా అలాంటిది జరగడం లేదు. రెండేసి పత్రాలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇచ్చిన ఫారాలను నింపడానికి సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అనుమానాలు వస్తే ఎవరికి అడగాలో? తెలియక గందరగోళంలో పడిపోతున్నారు. బీఎల్వోలకు ఫోన్లు పని చేయడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ 1950 పేరుకే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికీ రింగ్ అవుతున్నప్పటికీ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండటం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సర్ ప్రక్రియను అస్తవ్యస్తంగా కలగూర గంపగా మారుస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. బీఎల్వోలపై నియంత్రణ, పర్యవేక్షణ అన్నది మచ్చుకూ కనిపించడం లేదు. రాజకీయ పార్టీలతో సమన్వయం లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లను ఆయా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. వారి పాత్ర ఇందులో శూన్యం అవుతోంది. ఫారాలను నింపడానికి ఒక్కో ఓటరు అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వెలుగు చూస్తున్నాయి.
సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు అందించాలి. సాధారణంగా రెండు కాపీలు ఇచ్చి అందులో ఒకటి సేకరించాలి. మరోటి అక్నాలెడ్జ్మెంట్గా ఓటరుకు తిరిగి ఇచ్చేయాలి. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలి. జీపీ ఆఫీసులకు పిలిపించుకోవడం నిబంధనలకు విరుద్ధం. పక్షపాతం చూపడం, రాజకీయ పార్టీలకు అనుకూలంగా పని చేయకూడదు. ఇంటింటికీ వెళ్లకుండా ఆఫీస్‌లో కూర్చోవడం లేదా ఓటర్లను బలవంతంగా పిలవడం, ఫారాలు సరిగా పంపిణీ, సేకరణ చేయకపోవడం, అక్రమంగా ఓట్లను తొలగించడం, చేర్చడం నేరం.
ఓటర్ల నుంచి డాక్యుమెంట్లు, డబ్బులు డిమాండ్ చేయకూడదు. తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్రక్రి య జూన్ 25 నుంచి జూలై 24వరకు ఇంటిం టి సర్వే జరుగుతుంది. ఇది సాధారణ సవరణ ప్రక్రియ కంటే భిన్నమైనది, కీలకమైంది. బీఆల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారా లు ఇచ్చి, సేకరించి 2002 లేదా మునుపటి జాబితాతో మ్యాపింగ్ చేసి కొత్త డ్రాఫ్ట్ జాబితా సిద్ధం చేస్తారు. బీఎల్వోలకు తగిన శిక్షణ, అవగాహన లేకపోవడం వల్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఒకటే ఇవ్వడం, ఇంటింటికి వెళ్లకుండా జీపీ ఆఫీస్‌కు పిలవడం వంటిది జరుగుతోంది. సూపర్వైజర్లుగా నియమించబడిన వారంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఓటరు సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర చాలా కీలకమైంది. అత్యధిక చోట్ల అంగన్వాడీ టీచర్లకు ఈ బాధ్యతలను ఎన్నికల సంఘం అప్పగించింది. గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఒకటి నుంచి రెండు వరకు పోలింగ్ బూత్‌లను వీళ్లకే బాధ్యతలు ఇచ్చారు. దాదాపుగా వేయి ఓట్లకు ఇన్ఛార్జీగా బీఎల్వోలు కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘానికి క్షేత్ర స్థాయి ప్రతినిధిగా చలామణి అయ్యే బూత్ స్థాయి అధికారులకు అవగాహన లేమి పలు చోట్ల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అధికారుల ఒత్తిడి మేరకు ఆగమేఘాల మీద ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేసినప్పటికీ నిబంధనలు పాటించలేదు. ఓటరు జాబితా అప్డేట్ చేయడంలో అత్యంత విలువైన పని వీళ్లదే.
పక్షపాత రహితంగా, నిష్పక్షపాతంగా పని చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ తిరగడం, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు ధృవీకరించడం, ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం, సేకరించడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఇదంతా తప్పనిసరి. చనిపోయిన, మార్పులు చేర్పులు చేయబడిన ఓట్లను, డూప్లికేట్ ఓట్లను గుర్తించి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు నివేదించాలి. ఫార్మ్ 6, 7, 8 రూపంలో దరఖాస్తులు స్వీకరించడం, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం కూడా వీళ్ల పని. ఓటరు జాబితాలో స్పెల్లింగ్, ఫొటో, అడ్రస్, మొబైల్ నెంబర్ల సరి చేస్తారు. పొలిటికల్ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్‌తో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.