నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 25 : గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలను అవలంబిస్తున్నది. అయినప్పటికీ గంజాయి స్మగ్లర్లు కొత్తకొత్తదారులను వెతుకుతున్నారు. కట్టడి ఎక్కువ కావడంతో స్మగ్లర్లు ఇదే అదనుగా ధరను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. అయినప్పటికీ మత్తుకు అలవాటు పడిన యువకులు, విద్యార్థులు, కార్మికులు ఎంత ధర అయినా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లిక్విడ్ గంజాయి అమ్మకాలు సైతం ఇటీవల జిల్లాలో వెలుగు చూడడం కలకలం రేపుతున్నది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మత్తు పొందడం కోసం కొంత మంది యువకులు, లేబర్లు ఎండు గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తారు. రెండేండ్ల క్రితం వరకు సుమారు 5 నుంచి 8 గ్రాముల వరకు ఉండే ఎండు గంజాయి ప్యాకెట్‌ను రూ.50కి అమ్మేవారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు దాడులను ముమ్మరం చేయడం, గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడంతో గంజాయి సరఫరా తగ్గింది. ఇదే అదనుగా భావించిన స్మగ్మర్లు ధరను విపరీతంగా పెంచేశారు. ప్యాకెట్ ధర రూ.500 లకు పెంచేశారు. అయినప్పటికీ మత్తుకు అలవాటు పడిన వారు ధర ఎంతైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
రెండు నెలల కాలంగా జిల్లాలో పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖతో కలిసి దాడులను విస్తృతం చేశారు. నిజామాబాద్‌ను గంజాయిరహిత జిల్లాగా మార్చేందుకు కంకణబద్ధులయ్యారు. ఇందులో భాగంగా అజ్ఞాతంలో ఉన్న గంజాయి స్మగ్లర్లు, విక్రయదారులపై దాడులను ముమ్మరం చేశారు. వారిపై కేసులు నమోదు చేస్తూ జైళ్లకు పంపుతున్నారు.దీంతో మార్కెట్లో గతంలో మాదిరిగా గంజాయి లభించకుండాపోయింది. అయి తే మత్తుకు అలవాటు పడిన వారు మాత్రం ఎలాగైనా దాన్ని సేవించాలని గంజాయి విక్రయించే అడ్డాలతో పాటు వారికి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా గంజా యి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 8 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్ ధర రూ.వేయి వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఓ ముఠాను పోలీసు టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అరెస్టు చేసి వారి నుంచి లిక్విడ్ గంజాయి (హాషిష్)ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బాటిల్లో 5 నుంచి 7 మిల్లీలీటర్ల మేర ద్రవరూపంలో ఉండే గంజాయిని రూ.2వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీన్ని బట్టి స్మగ్లర్లు గంజాయి రవాణాకు కొత్తదారులు ఎంచుకుంటున్నట్లు అర్థమవుతున్నది.