వినాయక్‌నగర్, డిసెంబర్ 8: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని ఆమె చాంబర్లో జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, మోటర్ వెహికిల్స్ ఇన్సురెన్స్ కేసులు, పీఎల్సీ కేసులను పర్కిషరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఒకే వాహనంపై ఐదు కన్నా ఎక్కువగా ట్రాఫిక్ చలానాలు ఉన్న వారికి 50 శాతం రాయితీ పొందే అవకాశం లోక్ అదాలత్ ద్వారా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఒకే వాహనంపై 5 నుంచి 50 వరకు చలానాలు ఉన్న వాహనాలు 38 వేలు ఉన్నాయని, సదరు వాహనదారులకు మంగళవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ట్రాఫిక్ చలానాలు చెల్లించేందుకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేస్తారని, వాహనదారులు తమ చలానాలను చెల్లించుకోవాలని జిల్లా జడ్జి సూచించారు. ఇన్చార్జి న్యాయసేవా సంస్థ కార్యదర్శి సాయిసుధ, సీఐ ప్రసాద్ పాల్గొన్నారు.