డిచ్పల్లి, అక్టోబర్ 14 : తెలంగాణ యూనివర్సిటీతో నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు వర్సిటీలో వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎయాదగిరి, నాస్కామ్ రీజినల్ హెడ్ (తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్) బొజ్జం ప్రవీణ్‌కుమార్ మంగళవారం అవగాహన ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు.
అనంతరం వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ నాస్కామ్ ప్రధానంగా యూనివర్సిటీ అధ్యాపకులతో పాటు విద్యార్థులు, పరిశోధకులు కెరీర్లో ఎదగడానికి ప్యూచర్స్కిల్స్, డేటా సైన్స్, బిజినెస్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత శిక్షణ అందించడానికి ముందుకురావడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వినియోగించుకుని విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ నైపుణ్యాల దిశగా ముందుంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ ఆరతి, డాక్టర్ ప్రసన్నరాణి, కంట్రోలర్ ప్రొఫెసర్ కె.సంపత్‌కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఆంజనేయులు, డాక్టర్ అతిక్ సుల్తాన్ హోరీ, డాక్టర్ పున్నయ్య పాల్గొన్నారు.