బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ముందువరుసలో ఉన్నది. బీసీల్లో 18 నుంచి 22శాతం ఉన్న మున్నూరుకాపులకు సీఎం కేసీఆర్ రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలకు న్యాయం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీనే అని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ తెలిపారు. మున్నూరుకాపుల అభివృద్ధికి నడుం బిగించిన కేసీఆర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇటీవల నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ 10మంది మున్నూరు కాపు బిడ్డలకు టికెట్లు ఇచ్చి, రాజకీయంగా ప్రాధాన్యమిచ్చింది. ఇద్దరికి ఎమ్మెల్సీ, ఇద్దరికి రాజ్యసభ, ముగ్గురికి జడ్పీ చైర్మన్, ఒకరికి మేయర్ పదవి ఇచ్చి మున్నూరు కాపులను సీఎం కేసీఆర్ గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు మాత్రమే ఇచ్చింది.
నిజామాబాద్ ఉమ్మడి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బాజిరెడ్డి గోవర్ధన్‌కు టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో సైతం బాజిరెడ్డికి టికెట్ ఇచ్చి టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌ను చేసింది. ఆయన హయాంలోనే ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి అందులో 42వేల మంది కార్మికులకు భరోసా అందించింది. ఇదంతా మున్నూరు కాపు బిడ్డ హయాంలో జరగడం తాము గర్వకారణంగా భావిస్తున్నాం. దీనికి సీఎం కేసీఆరే కారణం.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మున్నూరు కాపులకు అండ గా నిలిచారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా..అదీ మండల స్థాయిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటలో రూ.5కోట్లతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ మాకు వరంగా అందింది. ఇది బీసీలకు కవితమ్మ అందించిన చేయూత. అందుకే సాయం చేసిన వారికి, అన్నం పెట్టిన వారికి అండగా ఉండాలి. రూ.5కోట్లతో ఫంక్షన్ హాల్ అందించినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తే పది వేల మంది మున్నూరు కాపు బిడ్డలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇదే బీఆర్ఎస్పై ఉన్న మా అభిమానానికి నిదర్శనం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ బిడ్డను తొలగించిన బీజేపీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ జపం చేయడం న్యాయం కాదు. బీసీ బిడ్డ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనను తొలగించి ఏ సామాజిక వర్గానికి కూర్చీ కేటాయించిందో అందరం చూశాం. వారి మాటలు నమ్మే ప్రసక్తే లేదు.
బీసీలకు, మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకీ అండగా ఉండాల్సిన తరుణం వచ్చింది. ఏ పార్టీ పేద, మధ్యతరగతి వారు ఉండే బీసీలకు న్యాయం చేస్తున్నదో అర్థం చేసుకొని అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మున్నూరు కాపు కార్పొరేషన్ కల సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది.
బీసీల్లో సమాజానికి అన్నం పెట్టే రైతులున్నారు. వారికి సాగునీటిని, పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఇది బీసీల ఉన్నతికి ఉపయోగపడుతున్నది. ఆసరా పింఛన్లు బీసీలకు అండగా నిలిచే గొప్ప పథకం. పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడంలో బీసీ కుటుంబాల్లో ఆడబిడ్డలకు అందుతున్న చేయూత. ఆసరా, కల్యాణలక్ష్మి, బీడీ పింఛన్లు, రైతుబంధు తదితర పథకాలు లక్షలాది మంది బీసీలకు భరోసానిస్తున్నాయి. చేయూతనిచ్చే పథకాలు బీఆర్ఎస్ ద్వారా అందుకుంటున్నాం. అందుకే బీఆర్ఎస్తోనే అన్నింటా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే బీసీల్లో సహజంగానే బీఆర్ఎస్పై సానుకూలత ఉన్నది. ఆ సానుకూలతతో వారి ఆకాంక్షలను గుర్తించి బాధ్యతగా వ్యవహరిస్తున్నది బీఆర్ఎస్ పార్టీయే. రాజకీయంగా, బీసీ కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అమలు చేస్తున్న పథకాలు అల్టిమేట్‌గా పేదలకు బుక్కెడు అన్నం పెట్టేవిగా ఉన్నాయి. పేదలకు అన్నం పెట్టే వారికి మద్దతు పలకడమే న్యాయం. బీసీల్లో బీఆర్ఎస్, కేసీఆర్‌పై విశ్వాసం నెలకొనడానికి ఆ బుక్కెడు అన్నం పెట్టే మానవీయ పథకాలే కారణం.