నాగిరెడ్డిపేట, జూలై 10 ; జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం మొదటిసారి ప్రారంభమైన కళాశాలను పట్టించుకున్న నాథుడే లేడు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కనీస కృషి కూడా జరగడం లేదు. వసతులు, సౌకర్యాలు కల్పిస్తూనే అధ్యాపకుల కొరత లేకుండా చూడాల్సిన అధికారులు నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహణపై అధికారుల తీరు మారడం లేదు. కళాశాల మంజూరై..ఎనిమిది నెలలు కావొస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. ఒక్క అధ్యాపకుడితో కళాశాల కొనసాగుతుండగా రెండు రోజుల క్రితం డిప్యుటేషన్‌పై ఇద్దరు అధ్యాపకులను పంపించి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగాలంటే..కనీసం 250 మంది విద్యార్థులు ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి ప్రిన్సిపాల్ హేమచందర్ నిర్లక్ష్యంతో పట్టుమని 50మంది విద్యార్థులు కూడా చేరలేదు. ముందే కోఎడ్యుకేషన్ కళాశాల. కనీస వసతులు, ఎలాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ కళాశాలను సందర్శించగా 13 మంది విద్యార్థులు, ఒక్క అధ్యాపకుడు నాగయ్య ఫిజిక్స్ లెసన్ ముగించుకొని వెళ్లిపోయాడు. ఉదయం 11 గంటలకు మరో ఇద్దరు అధ్యాపకులు రాములు (ఇంగ్లిష్), రాధ (సివిక్స్) తమ లెసన్ పూర్తి చేసుకొని కళాశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎల్లారెడ్డి జూనియర్ కళాశాలలో తమకు విధులు ఉన్నాయంటూ తాళం వేసి వెళ్తున్నారు. ఇదే తీరు కొనసాగితే నాగిరెడ్డిపేట జూనియర్ కళాశాల తిరిగి వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కళాశాలలో అధ్యాపకులు, వసతుల కల్పనకు కృషి చేయాలని మండల ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.
పన్నెండు మందికి ఒక్కరు కూడా లేరు
నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ తెలుగు, ఆంగ్ల భాషల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 50మంది మాత్రమే ప్రవేశం పొందారు. మంగళవారం వరకు కేవలం ఐదుగురు విద్యార్థులు హాజరుకాగా, బుధవారం 13మం ది హాజరయ్యారు. డిప్యుటేషన్‌పై కళాశాలకు ముగ్గురు అధ్యాపకులు వస్తుండగా వారు సైతం ఇక్కడ ఒక సబ్జెక్ట్ చెప్పుకొని ఎల్లారెడ్డికి వెళ్తున్నారు. అన్ని కోర్సులకు 12మంది అధ్యాపకులు ఉండాలి. కానీ ఒక్క అధ్యాపకుడిని కూడా నియమించలేదు. ఒకే తరగతి గది ఉండడంతో ఒకరు బోధిస్తున్న సమయంలో మరొకరు బయట నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
వసతులు కల్పించాలి..
కళాశాలలో సౌకర్యాలు, వసతులు కల్పిస్తేనే విద్యార్థులు చదువుకొనే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన విద్యార్థులకు ఇబ్బందులు ఉండడంతో మరుసటి రోజు రావడం లేదు. పూర్తిస్థాయిలో అధ్యాపకులు ఉంటే బాగుంటుంది. విద్యార్థులు పూర్తిస్థాయిలో చేరితేనే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సహకరించాలి.
– నాగయ్య, ఫిజిక్స్ అధ్యాపకుడు
వసతులు, సౌకర్యాలు కల్పించాలి
కళాశాలలో ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేవు. ఒక గది మాత్రమే ఉన్నది. అన్ని సబ్జెక్టుల వారిని ఒకే దగ్గర కూర్చొబెట్టి బోధిస్తున్నారు. కేవలం ఇంగ్ల్లిష్, ఫిజిక్స్, సివిక్స్ సబ్జెక్టులు మాత్రమే చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్తున్నాం. పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించాలి.
– ఉదయ్‌కిరణ్, ఎంపీసీ, ఫస్టియర్