Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై ముడు నెలలు గడుస్తున్నా సమావేశం నిర్వహించడం లేదని బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ వైస్ చైర్మన్ మీర్ ఇలియాజ్ అలీ ఆధ్వర్యంలో ఎంఐఎం కౌన్సిలర్లు కార్యాలయం ఆవరణలో టెంట్ వేసి కుర్చీలలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ పాలక వర్గం ఏర్పాటై మూడునెలలు పూర్తయినా నెలవారీ సమావేశాలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు కూడా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు విన్నవించామని ఆయన స్పందించకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ లో సమావేశలు నిర్వహించని కారణంగానా తామే కార్యాలయం ఆవరణలో టెంట్, కుర్చీలు వేసి అధికారులను ఆహ్వానించామన్నారు. అధికారులు ఇక్కడకు కూడా రాక పోవడంతో తమ సమస్యలతో కూడిన వినతిపత్రం ఖాళీ కుర్చీకి అందచేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల వైఫల్యం కారణంగా సమస్యల పరిష్కారం లో వార్డుల్లో ప్రజలకు ఏం చెప్పాలో తెలియక వార్డుల్లో తిరగడం కూడా మానివేశామని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపల్ సమావేశాలు నిర్వహించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు హెచ్చరించారు.