నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 21 : కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ నాయకులు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగర శివారులోని 13వ డివిజన్ సారంగాపూర్ గ్రామానికి చెందిన 40 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, సారంగాపూర్ గ్రామ మైనార్టీ నాయకుడు అక్బర్ నాయకత్వంలో బీఆర్ఎస్లోలో చేరారు. వీరందరికీ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పాలన తీరుపై ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నదని, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎన్ని గ్యారంటీ హామీలతో కూడిన ప్రచారం చేసినా వారు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తాము విజయం సాధించేందుకు దోహద పడుతాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఊహించని అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దీంతో తమ ప్రభుత్వం, ఎమ్మెల్యే అభ్యర్థులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో అశోక్, ఆంజనేయులు, ప్రశాంత్, శివరాత్రి సాయిలు, నర్సింహులు, లక్ష్మణ్, రమేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వేల్పూర్, అక్టోబర్ 21: సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మండలంలోని పడిగెల్ గ్రామంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 40 మంది యువకులు శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి వేముల ఆదేశాల మేరకు పార్టీ నాయకులు రేగుల్ల రాములు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఎన్నడూలేని విధంగా బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మంత్రి వేములకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.