ఖలీల్వాడి, ఆగస్టు 4: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ద్వారా హామీ ఇప్పించిన ఎంపీ ధర్మపురి అర్వింద్.. పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రెండోసారి ఎంపీగా అర్వింద్ గెలిచిన తర్వాత పసుపు బోర్డు ఊసేలేదని.. బోర్డు తెస్తారా లేదా అని ప్రశ్నించారు. సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులు, అభినందన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై లెక్కలు వేస్తున్నారే తప్ప.. ఏమాత్రం పేదవాడికి అందుతున్నదని చూడడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు రూ.30లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేశారని, పేదలకు మాత్రం చేసేందుకు మనసు ఒప్పదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పద్మ, పి.సుధాకర్, ఓమయ్య, సాయిలు, విఠల్గౌడ్, చక్రపాణి, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.