పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం కొనసాగుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఓట్ల వేటలో ప్రధాన జాతీయ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నేరుగా ఓటర్లకు ఫోన్లు చేస్తూ రహస్య ప్రాంతాలకు రప్పించుకుంటున్నారు. రూ.5వేలు చేతిలో పెట్టి ఓట్లను అభ్యర్థిస్తూ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకోవాల్సిన అభ్యర్థులు.. అవన్నీ పక్కనబెట్టి నోట్ల కట్టలతో ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. కండ్ల ముందే ఇదంతా జరుగుతున్నా ఎన్నికల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం.
-నిజామాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడింది. ఎన్నికల యంత్రాంగం నిద్రావస్థలో ఉండడంతో పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ వక్రమార్గంలో సాగుతున్నది. డబ్బు, మందు(లిక్కర్), విందు, చిందులతో ఓటర్లను ప్రస న్నం చేసుకుంటున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో రోజురోజుకూ ఓట్ల వేటలో ప్రధాన జాతీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు నేరుగా ఓటర్లకు ఫోన్లు చేస్తూ రహస్య ప్రాంతాల్లో కలుస్తున్నారు.
చేతిలో రూ.5వేలు పెట్టి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. గ్రూపులుగా భేటీలతోపాటు కుల సంఘాలు, విద్యా సంస్థల ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. యువజన సంఘాలు, ఉపాధ్యా య సంఘాలతోనూ చర్చ జరుపుతూ పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతున్నట్లుగా ఆరోపనలు వెల్లు వెత్తుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు తాము ఏం చేస్తామో చెప్పుకోవాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థులు.. అదం తా పక్కన పెట్టి,డబ్బుల కట్టలతోనే ఓట్లను కొనాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా తెలిసినా ఎన్నికల సంఘం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పర్యవేక్షణ కరువైంది.ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల నేతల ఇండ్లలో తనిఖీలు చేపట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు గెలుపు అవకాశాలు లేకుండా పోయాయి. అదృష్టంపైనే ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొనే దుస్థితి. పరువును నిలబెట్టుకునేందుకు ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దొడ్డి దారిని ఎంచుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. టెలీకాలర్లతో ఫోన్లు చేయించడంతో మొదలు పెడితే ఆయా రాజకీయ పార్టీల లీడర్ల సాయంతో ఓటుకు రూ.5వేలు వరకు వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సైతం నోట్ల కట్టలనే నమ్ముకున్నట్లు సమాచారం. బలమైన సంఘంగా చెప్పుకునే వారు ఓటుకు రూ.3వేలు పంచుతుండగా ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న అభ్యర్థి ఏకంగా రూ.5వేల చొప్పున డబ్బులిచ్చి ఓటర్లను తన గుప్పిట్లోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.
గంప గుత్తగా తమ భావజాలం కలిగి ఉన్న ఓటర్లను గుర్తించి వారిని మచ్చిక చేసుకుని ప్రయోజనాలు కల్పిస్తుండగా.. మరోవైపు నిరంతర ఫాలోఅప్ చేస్తూ ఎలాగైనా తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను అసహనానికి గురిచేస్తున్నారు. గెలిస్తే తాము ఏం చేస్తామో? వివరించకుండా, ఓట్లను కొనుగోలు చేయడంపైనే అభ్యర్థులు దృష్టిసారించడం గమనార్హం. జాతీయ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు కత్తిమీది సాములా మారడంతో ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో విజయావకాశాలను వెతుక్కుంటున్నాయి. గ్రామాల్లో ఆయా పార్టీల మండల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించి ఓటరు జాబితాను అనుసరించి ఫోన్లు చేసి అమ్యామ్యాలను అప్పగిస్తున్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం 4 నుం చి 27వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులను ఎన్నికల కమిషన్ మూసేయించింది. మూసివేతకు ముందే భారీగా మద్యం బాటిళ్లు డంప్ అయినట్లు తెలిసింది.
సమాజానికి నీతులు బోధించే ఉపాధ్యాయ వ ర్గాలు సైతం దారి తప్పి ప్రవర్తిస్తున్నాయి. ఫక్తు రాజకీయ పార్టీలకు సమానంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. సభలు, సమావేశాల్లో మందు, విందులు ఏర్పాటు చేస్తూ టీచర్ ఓటర్లను రాబట్టుకునేందుకు పాకులాడుతున్నాయి. కొంత మంది తీరు సభ్య స మాజం తల దించుకునేలా చేస్తున్నది. ఓటును అమ్ముకోవద్దంటూ విద్యార్థులకు సూక్తులు చెప్పే వర్గమే ఓటును బహిరంగ వేలం మాదిరిగానే అమ్మకానికి పెట్టడం విమర్శలకు తావిస్తున్నది. ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఇదే ధోరణితో దూసుకుపోతున్నారు. ఆయా రాజకీయ పార్టీల మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన వారంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు వెదజల్లుతున్నారు.
దీంతో ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల ఘట్టం నవ్వుల పాలవుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొద్ది రోజులుగా ఈ తంతు నడుస్తున్నది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయులు దొడ్డి దారిలో విధులకు డుమ్మా కొట్టి ప్రచార పర్వంలో భాగస్వామ్యం అవుతున్నట్లు సమాచారం. వార్షిక పరీక్షలు దగ్గర పడిన కీలక సమయంలో ప్రభుత్వ టీచర్లు వక్రమార్గంలో విధులకు డుమ్మా కొట్టడంపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా టీచర్ల ఓట్లను సైతం తమదైన శైలిలో రాబట్టుకునేందుకు బహుతులను సిద్ధం చేసినట్లు తెలిసింది. వారికి నేరుగా డబ్బులు ఇస్తే, ప్రయోజనం ఉండదని భావించి గిఫ్ట్ కూపన్లు, ఇతరాత్ర బహుమతులను ఇంటికే పంపించేలా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.