బోధన్, అక్టోబర్ 11: బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులను సహించేదిలేదని, ప్రజల సమస్యల గురించి అడిగితే.. పోలీస్ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దౌర్జన్యాలు, పోలీసు కేసులు, బెదిరింపులకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ విడుదలచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న బీఆర్ఎస్ మద్దతుదారులను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కొంతమంది కిందిస్థాయి కాంగ్రెస్ నాయకులు చేసే చిల్లర పనులపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దృష్టిని సారించాలని సూచించారు. పోలీసులు తమ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించడం మానుకోకపోతే రాబోయే పరిణామాలకు బాధ్యత వహించక తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలో మొదటగా తనను పోలీస్ కేసులతో వేధించడం ప్రారంభించారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై రెండు వేలకు పైగా పోలీస్ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్రమ కేసులు పెట్టడం, మానవత్వం మరిచి ప్రవర్తించడం పోలీసులకు సరికాదన్నారు. భారీ వర్షాలు, మంజీర, గోదావరి నదుల వరద, ఎస్పారెస్పీ ముంపుతో నియోజకవర్గంలో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు పంటలను నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని, వారిని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి పంట నష్టం జరిగిన అన్ని గ్రామాలకు వెళ్లాలని, సీఎంతో మాట్లాడి నష్టపరిహారాన్ని రైతులకు ఇప్పించాలని డిమాండ్‌చేశారు. వరదలతో ఒక్కో రైతు ఎకరానికి 25 నుంచి 30 వేల రూపాయల పెట్టుబడి నష్టపోయారన్నారు. అందులో సగమైనా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో ఇసుక, మొరం విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు అన్ని పథకాలకు పైసలు వసూలు చేస్తున్నారని, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఇటువంటి చిల్లర పనులను గమనించాలని సూచించారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి స్థానికంగా కార్యాలయం ఉండాలని, ఎమ్మెల్యేను ఎక్కడ కలవాలో తెలియని అయోమయంలో ప్రజలు ఉన్నారని షకీల్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన ఎమ్మెల్యే కార్యాలయాన్ని నిరూపయోగంగా ఉంచి, ఎందుకు పనికిరాకుండా చేశారని ప్రశ్నించారు. మంత్రి పదవి వస్తేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అలగటం సరికాదని, తాము కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరుచేసిన పనులకే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కాంట్రాక్టర్లు బిల్లులు అడిగితే.. ఆ పనుల డబ్బులు ఎర్రవెల్లిలో ఇస్తారంటూ ఎమ్మెల్యే మాట్లాడడం సరికాదని అన్నారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై కచ్చితమైన విధానాన్ని పాటించలేదని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ బోధన్, నవీపేట్, రెంజల్, ఎడపల్లి మండలాల అధ్యక్షులు సంజీవ్‌కుమార్, నర్సింగ్‌రావు, రాఘవేందర్, డి.శ్రీరామ్, బీఆర్ఎస్ నాయకులు భవానీపేట్ శ్రీనివాస్, మౌలానా, లింగారెడ్డి, ప్రవీణ్‌కుమార్, గుమ్ముల అశోక్‌రెడ్డి, నరేశ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, 22 నెలల పాలనలో వివిధ పథకాల కింద కోట్లాది రూపాయలను వారికి బకాయి పడిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నా రు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థినులు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, ఆటో కార్మికులకు అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మోసం చేసిందని మండిపడ్డారు. ఇంతవరకు ఒక్క పథకాన్ని కూడా అమలుచేయలేదని ఆయన విమర్శించారు. రైతు భరోసా, సన్న రకాలకు బోనస్, రైతు కూలీలకు ఆత్మీయ భరోసాతో పాటు తాను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఓట్ల కోసం ఇండ్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ బాకీ కార్డులు చూపించి నిలదీయాలని షకీల్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.