కామారెడ్డి/ఎల్లారెడ్డి/ గాంధారి/ మాచారెడ్డి/ దోమకొండ/ బీబీపేట్, మే 12 : జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం పొడిగా, ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో గంటపాటు చిరుజల్లులు కురిశాయి. ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది.
పట్టణంలో ఓ మోస్తరు వర్షం కురువగా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పడింది. ఎల్లారెడ్డికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీసాన్ పల్లి, భిక్కనూరు, శివ్వాపూర్, పెద్దారెడ్డి, మత్తమా ల తదితర గ్రామాల్లో మధ్యాహ్నం మూడు గంటల అనంతరం కురిసిన వర్షంతో వ్యవసాయ భూముల్లో నీరు నిలిచింది. పెద్దగా కురిసిన చినుకులు వర్షాకాలాన్ని తలపించాయని పలు గ్రామాల రైతులు తెలిపారు.
గాంధారితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. ఒకేసారి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిం ది. సోమారంతండాలో బలమైన గాలులు వీయడంతో కెతావత్ గఫ్పాకు చెందిన నివాసపు షెడ్డు రేకులు ఎగిరిపోయాయి. రేకులు పక్కనే ఉన్న ఎద్దుపై పడడంతో దానికి తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు తెలిపాడు.
మాచారెడ్డితోపాటు, గజ్యానాయక్ తండా, ఎక్స్‌రోడ్, ఘన్పూర్, అక్కాపూర్, పాల్వంచ, భవానీపేట, చుక్కాపూర్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దోమకొండ మండలంలో తేలికపాటి వర్షం కురిసింది. కల్లాల్లో ఎండబెట్టిన ధ్యానం తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పారు. బీబీపేట్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.