కంఠేశ్వర్, జనవరి 19: తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతిని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదివారం ఆమె వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్లోని ప్రధాన కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని, దాశరథి జన్మస్థలం మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో స్మృతివనం ఏర్పాటు చేయడంతోపాటు గ్రామస్తులు ఏర్పాటుచేసుకున్న గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని కోరారు. దాశరథి సాహిత్యాన్ని ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. శతజయంతి ఉత్సవాల ముగింపును గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించాలని కోరారు.