ఎమ్మెల్సీ కవిత నేడు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కవితకు తొలుత డిచ్పల్లి వద్ద ఘనంగా స్వాగతం పలుకనున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్దపెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.
-నిజామాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు ఎత్తుగడలకు పాల్పడి కవితను అక్రమంగా కేసుల్లో ఇరికించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆమెను తప్పుడు కేసులో జైలుకు పంపింది. నెలల పాటు అక్రమ నిర్బంధాలకు గురి చేసినప్పటికీ మొక్కవోని ధైర్యంతో న్యాయ పోరాటం చేసిన కవిత.. జైలు నుంచి విడుదలయ్యారు. కక్షసాధింపు రాజకీయాలను దాటుకుని, ఢిల్లీ నిర్బంధాలను బద్దలు కొట్టిన ఆమె.. తొలిసారిగా నిజామాబాద్ పర్యటనకు వస్తుండడంతో బీఆర్ఎస్
శ్రేణులు, జాగృతి నేతలు డిచ్‌పల్లిలో ఘనంగా స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి కవిత నేరుగా నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు చేరుకుంటారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
కుట్రలు బహిర్గతం..
బాధ్యురాలిని చేస్తూ రెండేండ్లుగా నడిపించిన టీవీ సీరియల్ లాంటి దర్యాప్తులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఈడీ తిలోదకాలిచ్చింది. మహిళలను విచారణ పేరిట కార్యాలయాలకు పిలవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈడీపై సుప్రీంకోర్టులో కవిత వేసిన కేసు విచారణ నడుస్తుండగానే, నిర్భంధంలోకి తీసుకుని ప్రజాస్వామ్య విలువలను కేంద్రం మంటగలిపింది. ఈడీ చర్యలపై న్యాయస్థానాల్లో పోరాటం చేసిన కవితకు ఉపశమనం దక్కడంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తనదైన శైలిలో వాగ్బాణాలు ఎక్కుపెట్టి ప్రజల కోసం పోరాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి ఆయా సంఘాలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీస్తూ నాటి ఉద్య మ కాలం నాటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.
ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయంగా కొనసాగించాల్సిన ఆనవాళ్లను మారుస్తూ నియంతృత్వ ధోరణిలో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ లోగోను మార్చేందుకు తొలి నాళ్లలోనే ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత ఏకంగా తెలంగాణ తల్లి రూపాన్నే మార్చే సే సాహసానికి ఒడిగ ట్టింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయదలిచిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని స్థాపించారు. కోట్లాది మంది ప్రజలు ఆరాధించిన విగ్రహాన్ని కాదని, మరో విగ్రహాన్ని ఎంపిక చేసి ఆవిష్కరించారు. ఉద్యమ కాలంలో భావోద్వేగ కేంద్రంగా మారిన నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్నే ప్రజలు ఇప్పటికీ కొలుస్తున్నారు. ఆదివారం నిజామాబాద్ పర్యటనకు రానున్న కవిత.. ఉద్యమ కాలంలో సుభాష్‌నగర్‌లో స్థాపించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సందర్శించి, నివాళులు అర్పించనున్నారు.