ఖలీల్‌వాడి, అక్టోబర్ 20 : అర్బన్‌లో అన్ని అర్హతలున్న నాయకుడు బిగాల గణేశ్‌గుప్తా అని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారంటే విజయం ఖాయమని తెలుస్తున్నదని, ఇక మెజారిటీ కోసమే మనం పని చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ప్రజలు మాటలను నమ్మరని, చేతలనే నమ్ముతారని తెలిపారు. హన్మంతుడి గుడిలేని ఊరులేదని, కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. కేసీఆర్ సైనికులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతి ఇంటి తలుపు.. ప్రతి గుండెనూ తట్టాలని సూచించారు. మహిళలు, విద్యార్థులు, సంఘాలు, యువతతో ఎలా మాట్లడాలో, ప్రతి డివిజన్లో తిరిగేందుకు కార్యాచరణను రూపొందిచామని వెల్లడించారు. అవతలి పార్టీవారు విమర్శిస్తే గట్టిగా జవాబు చెప్పాలన్నారు. డివిజన్ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు కష్టపడాలని, ఏ డివిజన్‌లోనూ ఓట్లు తగ్గవద్దని అన్నారు. ఎన్నికలంటే ఇంటి పెండ్లిలాగా అందరిదగ్గరికీ వెళ్లి ఓటేయ్యాలంటూ చెప్పాలన్నారు.
తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమేనని, బీఆర్ఎస్ది మాత్రం పేగుబంధమని అన్నారు. పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రలో కలిపింది నెహ్రూ అని, 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరాగాంధీ కాల్పులు జరిపించడంతో 369 మంది అమరులాయ్యరని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్‌గాంధీ అవమానించి తెలంగాణ ఆత్మగౌరవన్ని దెబ్బతీశారని తెలిపారు. 2009లో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో వందలాంది మంది ఆత్మబలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. అర్బన్ ఎన్నికల ఇన్చార్జిగా కవితక్క ఉండడం మనకు కొండంత అండ అని అన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను కార్యకర్తలకు వివరించారు. సమావేశంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, సుజిత్‌సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాశ్, మజాజ్అలీ తదితరులు పాల్గొన్నారు.