ఏడాది వ్యవధిలోనే గురుకులాల్లో నాణ్యత పూర్తిగా తీసికట్టుగా మారిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫలితంగా రోజూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనమండలిలో సోమవారం కవిత మాట్లాడుతూ గురుకులాల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు ఉంటే, కేసీఆర్ పదేండ్ల పాలనలో 275 బీసీ పాఠశాలలను ఏర్పాటు చేశామని వివరించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 31 బీసీ డిగ్రీ కళాశాలలు, రెండు బీసీ అగ్రికల్చరల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే, కేసీఆర్ హయాంలో రూ.14 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వెచ్చించామని, దీనివల్ల 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. విదేశీ విద్యా పథకం కింద 2,233 మందికి రూ.450 కోట్లు వెచ్చించామన్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్లు చెల్లించామంటున్న ప్రస్తుత ప్రభు త్వం.. బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 27 బీసీ గురుకులాలు నెలకొల్పామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక్క గురుకుల ఏర్పాటుకు ముందుకు రాకపోవడం దారుణమన్నారు.
గురుకులాల్లో మెనూ ఏర్పాటు చేశామని చెప్పారని, కానీ అమలు కావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచి మెనూను అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిపుత్రులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కవిత కోరారు. హనీ బీ కాలనీల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని సూచించారు. పట్టు పరిశ్రమకు వినియోగించే మల్బరీ సాగును ప్రోత్సహించాలన్నారు. సెరీకల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. నేతన్నలు కట్టిన జీఎస్టీని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.