Pakistan Strike | అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్‌లోని ఓ ఆస్పత్రిపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 400 మంది దుర్మరణం చెందారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు వెల్లడించారు.
డ్రగ్స్‌కు బానిసలైన వారికి చికిత్స అందించే ఓ ఆస్పత్రిపై పాక్ దాడులు జరిపిందని ఆప్గానిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు. ఈ దాడిలో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని పేర్కొన్నారు. దాడుల్లో 400 మంది వరకు మరణించారని.. సుమారు 250 మంది గాయపడ్డారని చెప్పారు. వైమానిక దాడులతో ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని.. వాటిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడిలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారి చికిత్స కోసం ఉపయోగిస్తున్న పరికరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయని అఫ్గాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా రోగులే ఉన్నారని పేర్కొన్నారు. కాగా, పాక్ దాడిని ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యేనని అభివర్ణించారు.
కాబూల్‌లోని ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేశారని ఆఫ్గానిస్థాన్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రి లక్ష్యంగా ఎటువంటి దాడులు జరపలేదని స్పష్టం చేసింది. తాలిబాన్ సైనిక స్థావరాలు, ఆయుద గోదాములు, ఉగ్రవాద మద్దతు కేంద్రాలే లక్ష్యంగా కచ్చితమైన దాడి చేశామని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులకు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండానే జాగ్రత్త పడుతూనే దాడులు చేశామని స్పష్టం చేసింది.