ఖలీల్‌వాడి, జూలై 10 : కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే రంకెలు వేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలందరం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తామని, మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం, పింఛన్లు పెంపు హామీలపై చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన జాగృతి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఈనెల 17న రైలురోకో నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదని ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు.
పోలవరం ముంపు పేరుతో ఏపీలో కలుపుకున్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబునాయకుడికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయించుకున్నారని తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
భద్రాచలంలో అంతర్భాగంగా, పట్టణాన్ని ఆనుకొని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర సేవలు పొందడానికి, స్వయం ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఐదు గ్రామాల ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు భద్రాచల రాముల వారి భూముల పరిరక్షణ కోసం ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విన్నవించారు.