నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుష్క, శూన్య నినాదంగా అభివర్ణించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇటువంటి పార్టీ వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు తొలిగిపోవన్నారు. తెలంగాణ బీసీలు చైతన్యం కలిగిన వారు కాబట్టి కచ్చితంగా సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడతారన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాలతో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలంతా మాట్లాడారు. ఎన్నికలు వచ్చినందునే ఇతర పార్టీలకు బీసీలపై ప్రేమ ఉప్పొంగుతుందన్నారు. కుల గణన అం టేనే ఒక అంటరాని అంశంగా బీజేపీ భావిస్తున్నద న్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టి రాష్ట్ర ప్రజల స్థితిగతులను తెలుసుకుని అన్ని వర్గాలకు అవసరమైన పనులు చేస్తున్నారన్నారు. బీసీ కుల గణన ఎందుకు చేపట్టలేకపోతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఎందుకు ప్రవేశ పెట్టడం లేదన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ను నిర్వీర్యం చేయడం సరికాదని కల్వకుంట్ల కవిత సూచించారు. 2004లోనే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను తీసుకుని నాటి ప్రధాని మ న్మోహన్ సింగ్‌ను కలిసి ఓబీసీలకు ప్రత్యేక మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ వినతి పత్రం సమర్పించారని, 20 ఏండ్లు గడిచినా కాంగ్రెస్, బీజేపీలు ఆ అంశం పై ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ నుంచి షబ్బీ ర్ అలీ పోటీపై స్పందిస్తూ కామారెడ్డిలో చెల్లని రూ పాయి నిజామాబాద్‌లో ఎలా చెల్లుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కామారెడ్డి నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తిని నిజామాబాద్‌లో ఆదరిద్దామా? అన్న దానిపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ష బ్బీర్ అలీ గతంలో గంప గోవర్ధన్ చేతిలో నాలుగు సార్లు ఓడిపోయారని ఇప్పుడు గణే శ్ గుప్తా చేతిలో ఓడిపోతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కుల, మతాల మధ్య ఎలాచిచ్చు పెడుతున్నదో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో అమ లు కాని విధంగా 24 గంటల విద్యుత్ కేవలం తె లంగాణలో మాత్రమే రైతుల కు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. కర్ణాటకలో రైతుల కు కరెంట్ ఇస్తామని హామీలు ఇచ్చి అధికా రం చేపట్టిన కాంగ్రెస్ కేవలం నెలల వ్యవధిలోనే చే తులు ఎత్తేసే దుస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ లో బీసీ సమాజానికి కొండంత అండగా కేసీఆర్ నిలిచారన్నారు.కేంద్రం ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నదన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా మంచీ చెడును గ్రహించాలని బీఆర్ఎస్ నేత, ముదిరాజ్ ముఖ్య నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మేలు చేయాల నే లక్ష్యంతో పని చేసిన వారు గతంలో ఎవ్వరూ కనిపించలేదని చెప్పారు. కేవలం కేసీఆర్ ఒక్కరే అట్టడుగు వర్గాల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ప్రజలంతా ఈసారి కూడా కారు గుర్తుకే ఓటేసి కేసీఆర్‌ను మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్లుగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ ఒక ప్రైవేట్ మాల్ మాదిరిగా మారిందన్నారు. మెగా సేల్ మాదిరిగానే అసెంబ్లీ స్థానాలకు టికెట్లు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ చైర్మన్లు మార గంగారెడ్డి, రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహ న్, జిల్లా ఒలింపిక్స్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానమే లేదని 54 శాతం మంది బీసీలుంటే వారిచ్చిన సీట్ల సంఖ్య ఎంత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొ న్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్ద మనుషులు ఈ ప్రాంతాన్ని గతంలో 40 ఏండ్లు పరిపాలించినా 50 శాతం ఎమ్మెల్యేల టికెట్లు రాకపోవడానికి కారకులు ఎవరన్నారు. కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్‌కు మద్దతు తెలపడం ప్రస్తుతం చారిత్రక అవసరమని పొన్నాల వివరించారు. నిజామాబాద్ జిల్లా రోగాలను నయం చేసే పసుపు పంటకు ప్రసిద్ధి అని… రాజకీయ రుగ్మతలను పారదోలే విధంగా ప్రజలంతా ఓటుతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పొన్నాల పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.