ఖలీల్వాడి, ఫిబ్రవరి 10: ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై గురువారం స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ ఇష్టంతో ఏదైనా ధరించ వచ్చన్నారు. స్త్రీల వ్యక్తిగత విషయాల్లో నాగరిక సమాజం జోక్యం చేసుకోకూడదన్నారు. విభిన్న సంస్కృతులు, మతాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి ఒక్కరికీ పరమత సహనం ఉన్నప్పుడే భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమవుతుందన్నారు. విద్యాలయాల్లో రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారు.
నుదుటన సిందూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముస్కాన్ (ముస్లిం యువతి) వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. ఎలా ఉండాలి..? ఏం ధరించాలి? ఏం చేయాలి..? అనే విషయాలను మహిళల ఇష్టాయిష్టాలకే వదిలేయాలని ఎమ్మెల్సీ సూచించారు. స్త్రీలు సృష్టికర్తలు అన్న హిందీ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ కవిత తెలుగు అనువాదం ఇలా ఉంది.. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మతమేదైనా సరే, మనమంతా భారతీయులమే..సిందూరం, పగిడీ, హిజాబ్, సిలువ ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య అయినా.. జైహింద్ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..సారే జహాసే అచ్ఛా.. అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా.. జనగణమనతో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా మనకు చెప్పింది ఒక్కటే.. మనం ఎవరైనా సరే.. మనమంతా భారతీయులమనే..