బోధన్, నవంబర్ 15: రాష్ట్రమంతటా బలంగా పింక్ వేవ్ కనిపిస్తున్నదని, మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హ్యట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని తెలిపారు. ‘సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు.. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట’ అని ఆమె వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయల్దేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అందరూ పిడికిలెత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు.. ప్రస్తుత పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బందూకు పట్టుకొని ప్రజల మీదకు వచ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోతారా అని అడిగారు. రైతుబంధును అన్నదాతలకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పింఛన్లు, రైతుబీమా వృథాగా ఇస్తున్నారని కూడా అంటున్నారని మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్.. రేపు పొరపాటున అధికారంలోకి వస్తే,. ప్రజల్ని కనీసం పట్టించుకుంటారా.. అన్న విషయాన్ని ఆలోచించాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని కవిత అన్నారు.
గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధిపై ప్రజలు చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతులకు నయా పైసా ఇచ్చిందా అని ఆలోచించాలన్నారు. లక్షలాది పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. ఏమీచేయని, ఎందుకూ పనికిరానివాళ్లు, చుక్క నీటిబొట్టును కూడా ఇవ్వనివాళ్లు.. ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడ కొడతాం.. మెడ కోసుకుంటాం.. అని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్మీద గెలవడం.. వారితో అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలి తప్ప వట్టిగానే అయ్యే పనికాదని స్పష్టంచేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి సాగునీటిశాఖ మంత్రిగా పనిచేసినా ఒక్క చెరువును కూడా మరమ్మతు చేయలేదని కవిత విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే షకీల్.. నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు కృషిచేశారని, ఎన్నో చెరువులను బాగుచేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు వచ్చేలా పనులు చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను మరోసా భారీ మెజారిటీతో గెలిపించి, సీఎం కేసీఆర్‌కు బోధన్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇద్దామని ఓటర్లకు కవిత పిలుపునిచ్చారు.