బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలపై కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్న మాటలన్నీ ఉత్తుత్తివేనని, వారి హయాంలో వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రధానికి బీసీలపై ప్రేమ ఉంటే ప్రత్యేక మంత్రిత్వ్యశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘాల గర్జన సభలో కవితతో పాటు మాజీ మంత్రి పొన్నాల, కాసాని జ్ఞానేశ్వర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్
పాల్గొన్నారు.
బోధన్, నవంబర్ 6: ఎన్నికల సమయంలో బీసీలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉట్టుట్టి మాటలు చెబుతూ మొసలి కన్నీరు కార్చుతున్నాయని, ఆ పార్టీలకు బీసీలపై ఎంతమాత్రం ప్రేమలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలపై ప్రధాని మోదీకి నిజంగానే ప్రేమ ఉంటే.. మొదట కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సోమవారం నిర్వహించిన ‘కులసంఘాల గర్జన’ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి తాము స్వాగతం పలుకుతామని, వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూడాలని ఆమె సూచించారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని, బీసీల కులగణనపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి..మోదీ ఇక్కడికి వచ్చి వట్టి మాటలు చెప్పి వెళ్లవద్దని అన్నారు.
ప్రధాని వెళ్లిన తర్వాత రాహుల్‌గాంధీ వచ్చి బీసీలపై మొసలి కన్నీరు కార్చుతారని విమర్శించారు. రూ.4వేల కోట్లు ఖర్చుచేసి కాంగ్రెస్ పాలనలో చేపట్టిన కులగణన నివేదికను ఆ పార్టీ ఇప్పటికీ బయటపెట్టలేదని, ఆ నివేదికను బయటపెట్టాలని ప్రధాని మోదీ కూడా అడగలేదన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే ఈ నాయకుల మాటలను తెలంగాణలోని బీసీలు నమ్మరని అన్నారు. కేసీఆర్ అన్ని కులాల అభ్యున్నతి కోసం 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి అందరి వివరాలు సేకరించారని, దీంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా ఫించన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు కులం, మతం లేవని, సబ్బండవర్ణాలు బాగుండాలన్న ఆలోచనే ఆయనకు ఉన్నదన్నారు. విద్యుత్, నిధులు, నీళ్లలో మిగులను సాధించామని కవిత అన్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 19 రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ గత పదేండ్లలో ఆ సంఖ్యను 63కు పెంచారన్నారు. అలాగే, బీసీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు రెండు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 23కు చేరాయన్నారు.
సీఎం కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేస్తున్నారని.. తాముకూడా రెండుచోట్ల పోటీచేస్తామని రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్ సిద్ధమయ్యారని, ఇది పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా ఉన్నదని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ‘సీఎం కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు.. జాతీయ నేత.. కాబట్టి ఆయనకు రకరకాల వ్యూహాలు ఉంటాయి. దీంతో ఆయన రెండుచోట్ల పోటీచేస్తున్నారు..’ అంటూ కవిత అన్నారు. రెండు చోట్ల పోటీచేసే రేవంత్, ఈటలకు వాతలు మాత్రమే మిగులుతాయని, ఎలాంటి ఫలితం ఉండదని సెటైర్ వేశారు. వాళ్లు మూడుచోట్ల పోటీచేసినా, నాలుగుచోట్ల పోటీచేసినా.. అంతిమంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశారు.
కేసీఆర్‌లాంటి గొప్ప నాయకుడు, బీసీల గురించి ఆలోచించే నేత దేశంలోనే లేరని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, కేసీఆర్ నాయకత్వంలోనే ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారని ఆయన అన్నారు. దేశంలోనే తెలంగాణకు కేసీఆర్ పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అధ్యక్షత వహించగా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్, బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూర షకీల్, బీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, ఎంపీపీలు బుద్దె సావిత్రీరాజేశ్వర్, శ్రీనివాస్, కొండెంగల శ్రీనివాస్, బోధన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీతాదేశాయ్, బీఆర్ఎస్ నాయకులు పి.రవికిరణ్, రవీందర్ యాదవ్, బుద్దె రాజేశ్వర్, గోగినేని నర్సయ్య, సంజీవ్‌కుమార్, భూమ్‌రెడ్డి, రజాక్, తెడ్డు పోశెట్టి, డి.శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
‘బోధన్ నుంచి మరోసారి పోటీచేస్తున్న మహ్మద్ షకీల్ ఎంత కష్టమొచ్చినా ఇక్కడే ఉంటారని, ప్రజల కష్టనష్టాలను పంచుకుంటారని.. షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. ఏ పండుగ వచ్చినా.. షకీల్ బోధన్‌లో ఉంటారని, అన్నివర్గాల గురించి ఆలోచించే మంచి మనిషని ఆమె చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి వచ్చారని, ఎన్నికలప్పుడు వచ్చిపోయే ఈ రెడ్డిలు, గాంధీలతో మనకు పనిలేదన్నారు. అందుబాటులో ఉండే షకీల్ కావాలో.. సుదర్శన్‌రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దసరా పండుగ వస్తే హిందూ ఆడబిడ్డలకు చీరలు పంచుతారని, రంజాన్‌కు కొత్త బట్టలు పంచుతారని, క్రిస్మస్కు ప్రతి చర్చికి కేక్ పంపిస్తారని, ఇంత మంచి నాయకుడు మీకు దొరుకుతాడా అని ప్రశ్నించారు.
బోధన్, నవంబర్ 6: అనుభవం, అవగాహన లేని కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని, మూర్ఖపు ఆలోచనలు చేసే కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ 24గంటల విద్యుత్‌ను అందిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలాంటి అనుభవం లేకుండా కేవలం ఐదు గంటల కరెంటు సరిపోతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కర్ణాటకలో చేపట్టిన కాంగ్రెస్ పథకాలు రైతులను కంటతడి పెట్టిస్తుందని, ఆ రైతులు మన ప్రాంతానికి వచ్చి ఆవేదన వ్యక్తంచేస్తున్నారని అన్నారు. పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమం, ఆత్మ గౌరవాన్ని పెంచింది సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత స్థానికంగా ఉంటూ మన సంస్కృతి, సంప్రదాయాలు, జాగృతిని ప్రపంచానికి చాటిచెప్పి అనతి కాలంలో అందరి ఆదరణ పొందారన్నారు. సీఎం కేసీఆర్ సంస్కరణలతో వరి సాగు మూడు రెట్లు పెరిగిందన్నారు.
సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలని, ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ తమతో ప్రతిసారి బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై చర్చిండంతోపాటు వివిధ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు, కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీల మాటలు వినకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ విజయానికి కంకణబద్దులై పనిచేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీసీలకు ఆత్మగౌరవం లభించిందనే విషయాన్ని గుర్తించాలన్నారు.
కేసీఆర్ బతికున్నంత కాలం సీఎంగా కొనసాగాలని, ఆయన హయాంలోనే బీసీలకు ఆత్మగౌరవం లభిస్తున్నదని ఖమ్మం ఎంపీ వద్దిరాజు రవిచంద్రం అన్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలకు ఓటు వేయవద్దని, ఆ పార్టీలు బీసీ, మైనార్టీ వర్గాలను ఆదరించవని, ఈ విషయం అందరూ గుర్తించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. ఏండ్ల కాలంలో జరగని అభివృద్ధి.. రాష్ట్రంలో కేవలం పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసే దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు.