రైతులు, దళితులకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, రానున్న ఎన్నిల్లో ఓట్ల కోసం మొసలికన్నీరు కారుస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దళిత డిక్లరేషన్, రైతు సదస్సుతో తెలంగాణలో వారు చేసేదేమీ లేదని, కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉన్నదన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్‌తో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే…
-కామారెడ్డి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ)
అమలవుతున్న పథకాలనే ఎజెండాలో పెట్టారు.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్.. దళితుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం అనేక పథకాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్తే ప్రజలు నమ్మరని చెప్పి ఖర్గే గారిని తీసుకువచ్చి మరీ వారి మీటింగ్ పెట్టించిన్రు. వాళ్లు చెప్పిన ఎజెండాను చూస్తే ఆల్రెడీ మనం చేస్తున్నయే వాళ్లు కొత్తగా చెబుతున్నారు. ఎంత విచిత్రమంటే అర్రస్ పాట పాడినట్లు అన్నరు. మనం దళితబంధు 10లక్షలు ఇస్తమంటే లేదులేదు మేం 12 లక్షలిస్తామంటున్నరు. మనం 2 వేల పింఛన్ ఆల్రెడీ ఇస్తున్నం. వాళ్లేమో నాలుగు వేలు ఇస్తామంటున్నరు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రం తప్పితే అందులో భావోద్వేగం లేదు. దళితుల పట్ల ప్రేమ లేదు. ప్రజల పట్ల ప్రేమలేదు. నిజంగానే తెలంగాణ సమాజాన్ని ఏదో ఉద్ధరించాలనే ఆలోచన లేదు. కేవలం రాజకీయం తప్పితే ఇంకొక్కటి లేదు. ఈ విషయాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగా దళితుల కోసం పని చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే. ఎక్కడ ఏ సమాజంలోనైనా కొలమానం ఏముంటుందంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదన పెరిగిందనేదే కొలమానంగా ఉంటది. రాష్ట్రం రాకముందు కన్నా ఇప్పుడు డబుల్ అయిన ఇన్కమ్ మన రాష్ట్రంలో, దేశంలోనే మనం నంబర్‌వన్‌లో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సాధించిందేమంటే ఒక్క అధ్యక్ష పదవి ఖర్గేకు ఇచ్చింది.
అంతే తప్పితే దళితులకు వాళ్లు చేసిందేమీ లేదు. మరి అటువంటిది ఫాల్స్ డిక్లరేషన్ ఒకటి పెట్టి, ప్రజల ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నరు. అన్ని చెప్పి ఒక విషయం మర్చిపోయిన్రు. మనం పూజ్య బాపు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ గురించి మాత్రం మాట్లాడిన్రు. ఆల్రెడీ మనం ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రాంని తిప్పిచెప్పి, మార్చి చెప్పి ఇంటర్మీడియెట్ పాస్ అయిన వ్యక్తులకు ఇంతిస్తం, డిగ్రీ పాసైన వ్యక్తులకు ఇంతిస్తం, పీజీ పాస్ అయిన వారికి ఇంతిస్తం అని చెప్పారు.. తప్పితే అందులో నిజం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం కాదు, చేసిన పార్టీ కాదు. దానికి మంచి ఉదాహరణే.. నిన్న గాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఏం చేసిన్రు కర్ణాటకలో చాలా పెద్దపెద్ద వాగ్ధానాలు చేసిన్రు.. నెలలోపల్నే వాళ్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రెస్‌మీట్ పెట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. మేం చేసిన వాగ్ధానాలపై ఏమీ చేయలేకపోతున్నమని చెప్పిండు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేసేటటువంటి శక్తి మీకు లేనప్పుడు వాగ్ధానాలు ఎట్ల చేస్తరు.. అంటే మీరు కర్ణాటకలో చేయలేనిది రేపు తెలంగాణలో ఎట్ల చేస్తరు? ఈ విషయం ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ పూర్తి అబద్ధం. ప్రజలు ఇలాంటి వాళ్ల మాటలు నమ్మకుండా విజ్ఞత ప్రదర్శించాలని కోరుతున్న. దేశంలో అత్యధిక సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి దేశ ప్రజలకు అన్యాయం చేసింది.
నిన్న అమిషాత్ వచ్చి రైతుల గురించి పెద్దపెద్ద విషయాలు చెప్పిండు. నిజంగా ఎంత పెద్ద జోక్ అంటే భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడుతుందంటే హంతకుడే వచ్చి నివాళులర్పించినట్లుంది. సావగొట్టి, చెవులు మూసి మళ్లవచ్చి దండ వేసిన్రట ఫొటోకు. ఎందుకంటే మూడు నల్ల చట్టాలు తెచ్చి 850 మంది రైతుల చావుకు కారణమైన పార్టీ బీజేపీ. ఇవాళ తెలంగాణలో 30 లక్షలపైగా మనకు వ్యవసాయ మోటర్లు ఉంటాయి. ఆ రైతులందరికీ కూడా మనం ఫ్రీగా కరెంటు ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏమంటది అంటే ఆ మోటర్లన్నీటికి మీటర్లు పెట్టండి అని చెబుతుంది. 25 వేల కోట్ల నష్టాన్ని భరించి మరీ మన ప్రభుత్వం మీటర్లు పెట్టబోమని చెప్పింది. భారతీయ జనతా పార్టీ ఏమో మీటర్లు పెట్టమంటది. మనమేమో పెట్టమంటున్నం. మల్ల ఏం ముఖం పెట్టుకొని వారు రైతు డిక్లరేషన్, రైతు సదస్సు పెట్టిన్రన్నది నిజంగా వాళ్లే ఆలోచన చేసుకోవాలి. అన్నిటికన్నా మించి మనం ఇచ్చేటటువంటి రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్రంలో ఒక పథకం ప్రారంభించిన్రు. ఎకరానికి 6 వేలు ఇస్తమని చెప్పిన్రు. అది కూడా మూ డు దఫాలు ఇస్తామన్నరు. కానీ 13 కోట్లతోటి ప్రారంభించిన పథ కం ఇప్పుడు కేవలం రెండున్నర కోట్ల మంది రైతులకు ఇస్తా ఉన్నా రు. అదే మన దగ్గర మనం రైతుల సంఖ్యను పెంచుకున్నం, రైతుబంధు అమౌంట్ పెంచుకున్నం. రైతుబీమా యాడ్ చేసుకున్న. అనేక పథకాలతోని వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకున్నం.
బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం 115మంది అభ్యర్థులను డిక్లేర్ చేసినం. అదే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. వాళ్ల పార్టీల్లో ముఖ్యమంత్రి క్యాండెట్ ఎవరో తెలియదు. మా పార్టీ బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి కేసీఆర్. మరీ వాళ్ల పార్టీల్లో ఎవరో చెప్పమనండి. వాళ్లు కన్ఫ్యూజన్లో ఉన్నరు. ఫ్రస్టేషన్లో ఉన్నరు. కాబట్టే ఇలాంటి సభలు పెట్టి అబద్ధాలు చెబుతున్రు. తెలంగాణ ప్రజలు ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానని అన్నారు.
మా గంప గోవర్ధన్ అన్న షబ్బీర్ అలీని నాలుగు సార్లు ఓడగొట్టిండు. 1994, 2009, 2014, 2018 ఎన్నికలల్ల ఓడించిండు. గంప గోవర్ధన్ అన్న నాలుగుసార్లు ఓడగొట్టిన మనిషి కోసం ఇంకొకరెందుకు. ఏదో మా వ్యూహంలో భాగంగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నరు. అది వేరే విషయం. కాకపోతే షబ్బీర్ అలీ కోసం అవసరం లేదు. సీఎం రావాల్సిన అవసరం లేదు.. అంత సీన్ కూడా లేదని’ ఎద్దేవా చేశారు.