నిజామాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే రేవంత్ సర్కారు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు వడ్లను ప్రైవేట్లో అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేదంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ఘనంగా చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరగడం లేదని మండిపడ్డారు. ఎక్కడికక్కడ రైతులంతా రోడ్లపైనే వడ్లను ఆరబోసుకుని విక్రయానికి పడిగాపులు కాస్తున్నారని వివరించారు. ప్రభుత్వం బోనస్ ఎగ్గొట్టడానికే ధాన్యం కొనుగోళ్లలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందన్నారు.
ప్రభుత్వం వడ్ల కొనుగోలు జాప్యం చేయడం వల్ల విధి లేక రైతలంతా వడ్లను ప్రైవేటు, దళారులకు అమ్మి నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం చేసిన జాప్యం వల్ల ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్న రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ఏ రైతు ఎంత వరి వేశాడో వ్యవసాయ శాఖ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని బోనస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున లెక్క కట్టి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించి రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. దొడ్డు వడ్లకు సైతం బోనస్ వర్తింపజేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.