ఖలీల్‌వాడి, డిసెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కన్నా సీఎం కేసీఆర్ హయాంలో రూ.వెయ్యి కోట్లు ఎక్కువగా రుణమాఫీ చేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రుణమాఫీ వందశాతం పూర్తయ్యిందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, దీంతో ఇక్కడి జిల్లా కాంగ్రెస్ నాయకులు రైతులను ఉద్దరించామని జబ్బలు చరుచుకుంటున్నారని అన్నారు. కల్లబొల్లి మాటలు బంద్ చేసి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా గ్రామానికి వెళ్లి రుణమాఫీ చేశామని మాట్లాడితే స్థానిక రైతులే వారి సంగతి చూసుకుంటారని అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి (నిజామాబాద్, కామారెడ్డి) జిల్లాలో మొత్తం 3,79,520 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు విడుతల్లో 2,01,967 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు. ఇంకా 1,78,000 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 2016, 2018లో రెండు విడుతల్లో కలిపి కేసీఆర్ ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ కోసం రూ.2,511 కోట్లు ఖర్చు చేస్తే .. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం చేసిన ఖర్చు రూ. 1,517 కోట్లు మాత్రమే అని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని నష్టపోయారని తెలిపారు. చాలా మంది రైతులకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.500 బోనస్ అందలేదన్నారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోని రైతులు ముందుగానే పంట అమ్మేయడంతో వారికి బోనస్ రాలేదన్నారు.
ఎన్నికల సమయంలో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల పంటవస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల పంట మాత్రమే కొనుగోలు చేసిందని మండిపడ్డారు. మిగతా పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారని తెలిపారు. జిల్లాలోని రైతులందరికీ రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి రైతుకూ ఎకరానికి ఎగ్గొట్టిన రూ.12 వేల బోనస్, రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు కుట్రచేస్తున్నదని, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుభరోసా ఎగ్గొడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రైతుభరోసాను ఇవ్వకపోతే సర్కార్ కూలిపోవడం ఖాయమని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అంతు చూస్తారని హెచ్చరించారు.
అధికారం చేపట్టిన ఏడాదిలోనే దేశంలోనే అత్యంత వేగంగా గ్రాఫ్ పడిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని సర్వేలు చెబుతున్నాయని వేముల తెలిపారు. ఆడలేక మద్దెల దరువు అనే రీతిలో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. హామీలు అమలుచేయలేక కేసీఆర్ మీద పడి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి రేవంత్‌రెడ్డి పాలన బుడుబుక్కల, బుడ్డర్ఖాన్, బుల్డోజర్ పాలనగా మారిందన్నారు.