బాల్కొండ/వేల్పూర్, ఆగస్టు 22: అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, కుంటిసాకులు చెబుతూ కొర్రీలు.. కోతలతో అన్నదాతలను నిండా ముంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గంలోని పలు మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాల్లో ఎమ్మెల్యే వేముల పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రభు త్వం మొదటిసారి గెలిచాక ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.లక్ష రుణమాఫీ చేశారన్నారు.
రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రుణమాఫీని సాకుగా చూపుతూ రేవంత్‌రెడ్డి తాము రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం, బ్యాంకు వెళ్లి రుణాలు తెచ్చుకోండంటూ రైతులకు మాయమాటలు చెప్పి ఆశపెట్టాడని వివరించారు. బాల్కొండ నియోజకవర్గంలో 2016లో బీఆర్ఎస్ హయాంలో 47,090 మంది రైతులకు రూ.236 కోట్ల రుణమాఫీ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 51వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే మూడు విడుతల్లో కేవలం 15,900 రైతులకు రూ.136 కోట్లు మాత్రమే మాఫీ చేసిందని, ఇంకా 36వేల మంది రైతులకు మాఫీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో రుణమాఫీ కోసం రూ.40వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పటి వరకు రైతులకు చేరింది కేవలం రూ.7500 కోట్లు మాత్రమేనని వివరించారు. బీఆర్ఎస్ మొదటిసారి చేసిన రూ. లక్ష రుణమాఫీలోనే 35లక్షల మంది రైతులకు రూ.17వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కాం గ్రెస్ చెప్పిన రూ.రెండు లక్షల రుణమాఫీకి రూ.18వేల కో ట్లు మాత్రమేనా? కాం గ్రెస్ చేసిన మోసం ఏంటో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలన్నారు.