బాన్సువాడ, జూన్ 28: తెలంగాణ రాష్ట్ర ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వేముల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి‘ అనే నినాదం మారుమోగుతున్నదని పేర్కొన్నారు. 14 ఏండ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ సాధించి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ, రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.
కానీ, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అబద్ధాలు చెబుతున్నదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని నమ్మబలికి, ఇప్పటివరకు సగం మందికి కూడా మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.45 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే చేసి, ఇంకా రూ.25 వేల కోట్లు రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు.
కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయానికే రైతు బంధు నిధులు జమవుతుండేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లప్పుడు రైతుబంధు వేస్తున్నదని, అదికూడా అసంపూర్తిగా వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల రైతు బంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా వర్షాకాలం రైతుభరోసా వేస్తామని చెబుతున్నారని దానికన్నా మొదలే ఇప్పటి వరకు ఎగొట్టిన రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. యూరియా, పొటాష్ వంటి ఎరువుల కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల కొరత లేకుండా గోదాముల్లో నిల్వ ఉంచే వారని గుర్తుచేశారు.

తులం బంగారం ఎక్కడ?
మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, 30 నెలలుగా ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఒక్కో మహిళకు రూ.75 వేల చొప్పున ప్రభుత్వం బాకీ పడిందని వేముల పేర్కొన్నారు. పెండ్లిలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకుండా దాదాపు 3 లక్షల మంది ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మోసపు మాటలు చెప్పడం ఆపి, ముందు ప్రతి మహిళకు ఇప్పటివరకు బాకీ పడిన రూ.75 వేలు, 3 లక్షల మంది ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, దాదన్నగిరి విఠల్‌రావు, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి తోట అగయ్య, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు యలమంచలి శ్రీనివాస్ , రత్నకుమార్, రాంచందర్, సాయిబాబా, గణేశ్, బాడి శ్రీనివాస్, అక్బర్, రమేశ్ యాదవ్, శివసూరి, చాకలి సాయిలు, సర్పంచులు ధర్మతేజ, మాధవరెడ్డి పాల్గొన్నారు.
పోచారానికి కాలమే బుద్ధి చెబుతుంది..
రాజకీయ స్వార్థం కోసం మాతృసంస్థ లాంటి బీఆర్ఎస్ పార్టీని, తమను ఎంతగానో ఆదరించిన అధినేత కేసీఆర్‌ను మోసం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి కాలమే తగిన బుద్ధి చెబుతుందని వేముల అన్నారు. గతంలో కేసీఆర్ పక్కనే ఉండి, ఎన్నో పదవులు అనుభవించి, ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరిన పోచారం వైఖరిని ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుబట్టారు. ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా‘ పోచారం ప్రవర్తన ఉందన్నారు. గతంలో పోచారం కుటుంబాన్ని తీవ్రంగా దూషించిన రేవంత్ రెడ్డి సంకలో ఏ మొఖం పెట్టుకుని చేరారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అక్కడ సరైన గుర్తింపు లేక, పట్టించుకునే వారు లేక పోచారం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ విషయం స్వయంగా ఇక్కడి నాయకులే కాల్ చేసి చెబుతున్నారని వేముల పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు‘ అని కేటీఆర్ ఖరాకండిగా చెప్పినట్లు ఎమ్మెల్యే కార్యకర్తలకు వివరించారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
నియోజకవర్గంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు పాల్పడినా లెక్కచేయకుండా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే బాన్సువాడలో బీఆర్ఎస్ జైత్రయాత్రను ఎవరూ ఆపలేరని వేముల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యకర్తకూ త్వరలోనే డిజిటల్ గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఐడెంటిటీ కార్డులు భవిష్యత్తులో కార్యకర్తలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కార్యకర్తలు ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా, పోలీస్ స్టేషన్‌కైనా వెళ్లి ఈ కార్డు చూపిస్తే అధికారులు గౌరవించి, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న రాజకీయ నాయకులు, అధికారులకు ’మిత్తితో సహా’ అసలు చెల్లిస్తామని హెచ్చరించారు. ఇటీవల వచ్చిన రెండు, మూడు రాజకీయ సర్వేలు అన్ని నియెజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని స్పష్టం చేస్తున్నాయని వేముల తెలిపారు.
రైతాంగాన్ని పట్టించుకోని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, యువత, మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్.. అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి. సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేయించాలి. బూత్ లెవల్ ఏజెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేస్తాం. వారు ఇంటింటికీ వెళ్లి పదేండ్ల కేసీఆర్‌పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలుచేసిన సంక్షేమ పథకాలు వివరించాలి.
-వీజీగౌడ్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి
పోచారాన్ని బ్యాన్ చేసినట్టు అనిపిస్తున్నది
-జీవన్ రెడిఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ్డ
బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డిని బాన్సువాడ ప్రజలు బ్యాన్ చేసినట్లు కనిపిస్తున్నది. రుణమాఫీ తీసుకొస్తా అని చెప్పిన ఆయన తెచ్చా డా? కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో బాన్సువాడకు అధిక నిధులు ఇచ్చారు. ఇప్పుడు పోచారం కొడుకులను ఒక్కో దిక్కుకు అప్పగించాడు. ఒకరు ఇసుక రెడ్డి, మరొకరు కంకరరెడ్డి, మరొకరు భూమి రెడ్డి తప్ప మిగతా వారందరూ బీఆర్ఎస్ కార్యకర్తలే. పనుల గురించి పోచారం కాంగ్రెస్‌లోకి పోతున్నా అని చెప్పాడు. మరి పైసలు వచ్చాయా? నియోజకవర్గ అభివృద్ధికి రాలేవు కానీ ఆయన కుటుంబానికి మాత్రం వస్తున్నాయి. ప్రజలకు ఏం రావడం లేదు.
కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దు..
-బిగాల గణేశ్‌గుప్తా, అర్బన్ మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. మళ్లీ ఎన్నికలు వస్తాయనే అరునెలల ముందు నుంచే ప్రజలను నమ్మించేందుకు కార్యక్రమాలు చేపడుతుంది. అలాంటి మోస పూరిత కాంగ్రెస్ పాలన పై ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు వివరించాలి. ఇప్పటికే చాలా సర్వే సంస్థలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ సీఎం కావడం ఖాయం. బాన్సువాడలో కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దు. బాన్సువాడలో పోచారం లేకున్నా బీఆర్ఎస్ సైన్యం ఉంది.
ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర
-కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణకు భద్రత ఉంటుంది. ఇటీవల ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ, ఏపీని ఇండియా, పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు తెలంగాణకు చెందిన ఒక్క నాయకుడు వ్యతిరేకించలేదు. కాళేశ్వరం రెండు పిల్లర్లు కుంగిపోతేనే బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. బాన్సువాడలో బీఆర్ఎస్కు పూర్వ వైభవం తెచ్చిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. సభ్యత్వ నమోదు సమావేశంలో పార్టీ కార్యకర్తలను చూశాక పోచారం ఒంటరైనట్లు అర్థమవుతున్నది.
ఎస్సీ,ఎస్టీ, బీసీలను మోసం చేసిన ప్రభుత్వాలు
-హన్మంత్ షిండే, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తున్నాయి. దళితబంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రూ.పది లక్షలు ఇస్తే , అంబేద్కర్ అభయ హస్తం పేరిట రూ.12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అసలు దళితబంధు ఊసే లేదు. మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ , ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ప్రతితండాకు రూ.25 లక్షలు ఇస్తామనిచెప్పి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుంది.
సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు..
-జాజాల సురేంద్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
యూరియా యాప్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడి పోరాడుతుంది. రైతుల కోసం ఎంత పోరాటం చేసినా కాంగ్రెస్ సర్కార్‌కు చీమ కుటినట్లు కూడా లేదు. రైతులకు సగం మందికి స్మార్ట్ఫోన్లు లేవు.వారికి యాప్ లేకపోతే యూరియా ఎలా బుక్ అవుతుంది.?రైతుల పక్షానా తాడ్వాయి మండల కేంద్రంలో ధర్నా, నిరసన చేపడితే నన్నుపోలీసులు అక్రమంగా అరెస్టు చేసి బీర్కూర్ ఠాణాకు తరలించారు. బీర్కూర్ మండల కేంద్రంతో పాటు బాన్సువాడ, పొతంగల్, కోటగిరి తదితర మండలాల నుంచి వందల సంఖ్యలో విడుదల చేయాలని ధర్నాకు దిగారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో బలమైన కార్యకర్తలు ఉన్నారు.
కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
-తోట ఆగయ్య, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరుగ్యారెంటీలు, 420 హామీల అమలుపై ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలి. ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ పార్టీ ప్రజలకు చేసిన మోసాన్ని వివరించాలి. సభ్యత్వ నమోదులో బాన్సువాడ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలుపాలి. ఎన్నికలు ఎప్పడు వచ్చినా ప్రజలు గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు చేపట్టే ఓటర్ల జాబితాను బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించాలి. ఓటు హక్కులేని వారికి ఓటు హక్కు కల్పించాలి.