నిజాంసాగర్ , అక్టోబర్29: జుక్కల్ చౌరస్తాలో నేడు (సోమవారం)నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కోరారు. ఈ మేరకు కొనసాగుతున్న ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాల్గొనున్న సభకు సుమారు 50వేల మంది హాజరుకానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ రానున్నారని తెలిపారు. సభకు వచ్చే వారి కోసం నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, మహ్మద్‌నగర్ మండలాలకు చౌరస్తాకు ఇటు వైపు, బిచ్కుంద, మద్నూర్, డొంగ్లీ మండలాల నుంచి వచ్చే ప్రజలకు చౌరస్తా అటు వైపు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.