శక్కర్‌నగర్, జూలై 22: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నూతన సెక్రటేరియట్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని నివేదించగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే షకీల్ నుంచి వెల్లడించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రూ. 50 కోట్లు, బోధన్ మున్సిపల్ కౌన్సిల్‌కు వివిధ అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు, బోధన్ నియోజకవర్గంలోని ఎస్టీ తండాల్లో రోడ్లు, కమ్యూనిటీ భవనాలకు రూ.11 కోట్లు, నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికలు, ఈద్గాలు, క్రిస్టియన్ గ్రేవ్‌యార్డులు, చర్చీల నిర్మాణాలకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా సాటాపూర్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు కందకుర్తి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రూ.23 కోట్లు, నవీపేట్ మండలం యంచ నుంచి నందిగామ వరకు రూ.6.5 కోట్లు, నవీపేట్ మండలం గాంధీనగర్ నుంచి బినోల, బినోల నుంచి సిరన్‌పల్లి, లింగాపూర్ రోడ్డుకు రూ.21.3 కోట్లు, బోధన్ మండలంలోని మావంది కుర్దూ నుంచి పెంటాకుర్దూ రోడ్డుకు రూ.5.5 కోట్లు మంజూరీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే షకీల్ వెల్లడించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజవర్గ ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కృతజ్ఞతలు తెలిపారు.