చందూర్, మార్చి 7: రైతన్నలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగునీరందించి పంటలను కాపాడుతామన్నారు. గురువారం ఆయన మండలంలోని మేడ్పల్లిలో పర్యటించారు. రైతులు సాగుచేస్తున్న పంటలతోపాటు కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. ఇటీవల పంటలకు చెరువుల నుంచి నీరందిస్తున్న కాలువల్లో మట్టిపేరుకుపోవడాన్ని మాజీ సర్పంచ్ రవి ద్వారా తెలుసుకున్న పోచారం.. తన సొంత ఖర్చు రూ. 2లక్షలతో కాలువ పూడికతీత పనులను చేపట్టారు. గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..గ్రామంలోని లక్ష్మీసాగర్ తండాకు రెండు కాలువలు ఉండగా..
కుడి కాలువ, ఎడమ కాలువ ద్వారా సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలను సాగుచేస్తున్నారని తెలిపారు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పిల్ల కాలువల్లో మట్టి పేరుకుపోయి పంటలకు నీరు సరిగ్గా అందడం లేదన్నారు. దీంతో సర్వే చేయించి రూ. 5 కోట్లతో మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. కుడి కాలువ ద్వారా లక్ష్మాపూర్ నుంచి తిమ్మాపూర్ వరకు నీరు సాఫీగా వెళ్తున్నదని, ఎడమ కాలువలో గడ్డి, మట్టి పేరుకుపోయి నీటి ప్రవాహం తగ్గిందని అన్నారు. మరమ్మతుల కోసం రూ. 2 లక్షలు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధుల విడుదల ఆలస్యమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండకుండా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు.