బాన్సువాడ రూరల్, నవంబర్ 25: అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద కుటుంబాలకు కూడు, గుడ్డతో పాటు నీడ అవసరమని, కేసీఆర్ సహకారంతో పేదల సొంతింటి కలను సాకారం చేశామన్నారు.
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపం, 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నాగారం గ్రామంలో రూ.50 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశామన్నారు.