ఆర్మూర్టౌన్, ఆగస్టు 30: మున్సిపల్ అధికారులు క్రమశిక్షణతో ఉండాలని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్తోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా గణపతి విగ్రహాల తయారీదారులు..ఎమ్మెల్యేను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.పర్మిషన్ల కోసం మున్సిపల్ అధికారులు డబ్బులు అడుగుతున్నారని, తాము రూ.నాలుగు వేలు చెల్లించినా, రూ.30 వేలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను కమిషనర్ రాజును అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.