నందిపేట్, సెప్టెంబర్ 25: ప్రభుత్వ హాస్టల్లో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లతో పాటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పిల్లలతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం సరిగా లేదని, శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉంటున్నామని, ఇతర సమస్యలు ఉన్నాయని విద్యార్థులు చెప్పారు.
వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని రాకేశ్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రపంచంలో అత్యున్నత గౌరవమైన వృత్తి ఉంటే ఉపాధ్యాయ వృత్తేనని ఎమ్మెల్యే అన్నారు. టీచర్లు సమయానికి బడికి రావాలని, విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతీది ప్రభుత్వమే చేయాలంటే కుదరదని, నీరు వృథాగా పోకుండా నల్లా పెట్టేందుకు ప్రభుత్వమే రూ.100 ఇవ్వాలంటే సమంజసం కాదన్నారు. ప్రతీ దానికి ప్రభుత్వంపైనే ఆధారపడకుండా చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నారు.