ఎల్లారెడ్డి రూరల్, జూన్ 1: ధాన్యం తూకం ప్రారంభం కాకముందు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలిచ్చామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చెప్పి అమెరికా పోయిండని, అంతకుమించి ఆయన చేసిందేమీలేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్ అన్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఫాంహౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. లారీలు రాక, ధాన్యం రైస్‌మిల్లులకు తరలక రైతులు కన్నీళ్లు పెడుతున్నారని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అనుచిత వ్యాఖ్యలుచేశారని కొం దరు కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. రెండురోజుల క్రితం జరిగిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి వచ్చిన స్పందని చూసి కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కల్లాల్లోని ధాన్యాన్ని ఎక్కడా ఆగకుండా లారీలను తీసుకువచ్చి రైస్‌మిల్లులకు తరలిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు కల్లాల వద్దకు రావాలని, తాము కూడా వస్తామని రైతులు నిజం ఏంటో, వారి బాధలేంటో చెబుతారని అన్నారు. వేముల వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కనీస జ్ఞానం లేకుండా మాట్లాడి ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. అందరం కలిసి కల్లాల వద్దకు వెళ్లి రైతులు, గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడుదామని ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మంచిగా పాలిస్తున్నదని అంటే ఎల్లారెడ్డి గాంధీ చౌక్‌లో ముక్కు నేలకు రాస్తామని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి, మీకు గులాంగిరీ చేస్తానన్నారు.