నిజాంసాగర్, ఏప్రిల్ 9: కార్యకర్తలకు అండగా ఉండి, తాను బతికున్నంత కాలం సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మొదట గ్రామ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ తాను ఓనమాలు నేర్చుకున్నది జుక్కల్‌లోనే అని, ఇప్పటి వరకు ఎంతో మంది పాలించినా ఈ ప్రాంతాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే 75 శాతం మేర అభివృద్ధి చేశామన్నారు. మరోమారు ఆశీర్వదిస్తే మిగిలిన 25శాతం పనులు చేస్తామని హామీ ఇచ్చారు. తనకు కార్యకర్తలే అతి పెద్ద ఆస్తి అని, పొలాలు, బంగ్లాలు, డబ్బులు అవసరం లేదన్నారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే పేదలు, మహిళలు, యువకులు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణాను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధిలో ముందుంటున్నాయని వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా 24గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టులను నిర్మించి సాగు నీటి రంగాన్ని బలోపేతం చేశారన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచఖ్యాతి గల ఐటీ సంస్థలు, సుమారు 18వేల పరిశ్రమలను రాష్ర్టానికి తేవడంతో 21లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్షకట్టి, రావాల్సిన నిధులకు అడ్డం పడుతున్నారని, అయినా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని వివరించారు.
జుక్కల్ నియోజకవర్గంలోని నాన్‌కమాండ్ ఏరియాకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో రూ.476 కోట్లతో నాగమడుగు మత్తడికి నిధులు మంజూరు చేశారని, కాళేశ్వరం నీటిని సింగూరుకు తీసుకురావడంతో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందుతుందని అన్నారు. మరోమారు అధికారంలోకి వస్తే సింగూరు నుంచి బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీటిని అందించే పథకంతో కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి నీటిని రప్పించి జుక్కల్ మండలాన్ని సస్యశ్యామలం చేస్తానని అన్నారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రానికి చెందిన బీడీ కార్మికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీపీ యశోదానీలూ పటేల్, సాయాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాధవ్‌రావ్ దేశాయ్, సీనియర్ నాయకులు నీలూ పటేల్, బొల్లి గంగాధర్, సొసైటీ చైర్మన్ శివానంద్, వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, హట్కార్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పాకలి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి శంకర్, భాను, బొంపెల్లి రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.