ఖలీల్‌వాడీ, మే 2: సంపదకు మూలం కార్మికుల స్వేదమని, శ్రామికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో మున్సిపల్ కార్మికులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మంది మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి వారితో సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ పట్టణాలు, పల్లెల అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని గుర్తించిన సీఎం కేసీఆర్ మేడే కానుకగా రూ.1000 పెంచారన్నారు. పనిభారం తగ్గించేందుకు కొత్త సిబ్బందిని నియమించామని, కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు.
కార్మికుల శ్రమ గొప్పదని, వారి సేవలు వేల కట్టలేనివని, నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల కృషి అమోఘమని కొనియాడారు. కార్మికుల కృషితోనే రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలకు అవార్డులు వచ్చాయన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను అడ్డుపెట్టి నగర ప్రజల కోసం పని చేశారని, కార్మికులు పని చేస్తున్న చోటునే నా సొంతంగా భోజనం వితరణ చేశానని వివరించారు. దేశమంతా లాక్డౌన్ ఉన్నా మున్సిపల్ కార్మికులు ధైర్యంగా పని చేశారని గుర్తు చేశారు. పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, కార్మికుల శ్రేయస్సు కోరి మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగు వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, నవీద్ ఇక్బాల్, సిర్ప రాజు, రాజు, దారం సాయిలు, కార్పొరేటర్లు మల్లేశ్ యాదవ్, వెల్డింగ్ నారాయణ, అక్బర్ హుస్సేన్, అబ్దుల్ ఖుద్దూస్, బీఆర్ఎస్ కార్మిక విభాగం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, అహ్మద్, రాజేంద్రప్రసాద్, బిల్ల మహేశ్, మాయవార్ సాయిరాం, చాంగుబాయి, గంగామణి, అరుణ్ పాల్గొన్నారు.