డిచ్పల్లి, అక్టోబర్ 27 : గొల్లకుర్మలు, యాదవులు లక్ష్మీపుత్రులని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గొల్లకుర్మలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను పట్టించుకున్న నాథుడే లేడని, తెలంగాణ సాధించుకున్నాక సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకూ సమన్యాయం చేస్తున్నారన్నారు. మండలకేంద్రంలోని జీ-కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనానికి గొల్లకుర్మలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే బాజిరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, మీరే నా బలం, నా బలగం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చాక విడుతల వారీగా ఆసరా పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని తెలిపారు. కేసీఆర్ చేసేదే చెబుతారని, చెప్పింది తప్పక చేసి తీరుతారన్నారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంద్రబాబునాయుడు ఏజెంట్ అని, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రూరల్ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్ మట్లాడుతూ.. కులవృత్తులను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. వారి కల్లబొల్లి మాటలు నమ్మితే మోసపోయేది మనమేనని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోమారు కేసీఆర్‌నే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మహిపాల్‌యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండు నర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజారాం యాదవ్, బీసీ నాయకుడు నరాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి లింగం యాదవ్, సిరికొండ మాజీ ఎంపీపీ మంజులా యాదవ్, భూమన్న, కమ్మసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలగల శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.