నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 22 : తొమ్మిదేండ్ల పాలనలో దేశాన్ని రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కేంద్రం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్నారు. నగర శివారులోని 18వ డివిజన్ ముబారక్‌నగర్ గ్రామంలో విలీన గ్రామాల కింద మంజూరైన ప్రత్యేక నిధులు రూ.6.54 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ, బీటీ రోడ్లు, వైకుంఠధామం, ప్రహరీ నిర్మాణ పనులకు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను బడాబాబులకు ధారాదత్తం చేశారని, దీంతో ఆ సంస్థలో పని చేసిన ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేస్తున్న దాఖలాలు లేవన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టి ఉద్దేశపూర్వకంగానే వాస్తవంగా రావాల్సిన నిధులను కూడా మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎన్నో అవాంతరాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని వివరించారు. రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాల బీడు భూములను సాగులోకి తేవడానికి కోట్లాది రూపాయలతో చేపడుతున్న మంచిప్ప రిజర్వాయర్, పైపులైన్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాయమాటలు చెబుతూ, అబద్ధపు ప్రచారంతో ముందుకు వచ్చే బీజేపీకి ఓట్లు వేయకుండా అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డిని గ్రామపెద్దలు ఘనంగా సన్మానించారు. వివిధ కులసంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ సమస్యల వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ యమునా అనిల్, ఎంపీపీ అనూషా ప్రేమ్‌దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, గూపన్పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సాయిలు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, కేసీఆర్ సేవాదళ్ జిల్లా నాయకుడు రమణారావు, రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ దేవేందర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.