ఆర్మూర్, నవంబర్9: నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ మధుశేఖర్, ఓయూ నేత రాజారాం యాదవ్‌తోపాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలతో భారీ ర్యాలీగా వెళ్లి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జీవన్‌రెడ్డి ఆయన సతీమణి రజితారెడ్డితోకలిసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్‌కు బయల్దేరారు. ఆలూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రారంభమైన ర్యాలీ పెద్ద బజార్, గోల్‌బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా ఆర్మూర్ తహసీల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రం వరకు సాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులతో పట్టణ రోడ్లన్నీ నిండిపోయాయి. పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డు నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్మూర్ తహసీల్ కార్యాలయంలో జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఆయన సతీమణి రజితారెడ్డి ర్యాలీకి వచ్చిన మహిళలతో కలిసి నడుచుకుంటూ తహసీల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ రజితారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసి సభ వద్ద ఆర్మూర్ పట్టణ నాయకులు డప్పు వాయిద్యాలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. వారితో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు డ్యాన్స్‌లు చేశారు. నామినేషన్ కేంద్రానికి భారీ ర్యాలీతో వచ్చిన జీవన్‌రెడ్డి తహసీల్ కార్యాలయం ఎదుట పట్టణానికి చెందిన వేద పండితులు సత్యం పంతులు, రాజు పంతులు ప్రత్యేక పూజలు చేసి తిలకం దిద్ది జీవన్‌రెడ్డిని ఆశీర్వదించారు. నామినేషన్ కేంద్రంలోకి జీవన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఆయన వెంట ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితాపవన్, కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, ఖాందేశ్ శ్రీనివాస్, పూజ నరేంవర్ తదితరులు ఉన్నారు.
ఆర్మూర్‌టౌన్, నవంబర్9: బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ అట్టహాసంగా కొనసాగింది. మంత్రి కేటీఆర్ హాజరుకావడం ప్రజల్లో నయా జోష్ నింపింది. ర్యాలీలో వివిధ కులాల సంఘాల ప్రజలు తమ కులవృత్తిని ప్రదర్శిస్తూ కేటీఆర్‌ను, జీవన్‌రెడ్డి స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు.